పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో గతకొద్ది రోజులుగా వింత వ్యాధికి గురయి వందలసంఖ్యలో ప్రజలు ఆస్పత్రిపాలవుతున్న విషయం తెలిసిందే. ఇలా అనారోగ్యానికి గురయిన వారిలో కొందరు మరణించారు. అయితే ప్రజలు ఇలా హటాత్తుగా అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారో గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయి వైద్యారోగ్య సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఏలూరు వింతరోగంపై కారణాలను గుర్తించే పనిలో పడింది.

ఏలూరు వింత రోగాన్ని గుర్తించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నించిన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్  కీలక అంశాలతో కూడిన నివేదికను రూపొందించింది.  ఏలూరు నగరం నుండి 36 తాగునీటి శాంపిల్స్ సేకరించి పరిశీలించగా మూడింటిలో లెడ్, మూడింటిలో నికెల్ మోతాదు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ 36 శాంపిల్స్ లోనూ మెర్కురీ మోతాదు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆర్గానో క్లోరిన్ ఎక్కడా బయటపడలేదని తెలిపింది.  

read more  ఏలూరు వింతవ్యాధి... వాటిపై మాత్రమే అనుమానాలు: కుటుంబ ఆరోగ్య శాఖ కమీషనర్

ఇక అన్నంలో మెర్కురీ మోతాదు అధికంగా ఉండటాన్ని గుర్తించామని వెల్లడించింది. కూరగాయలని పరిశీలిస్తే ప్రమాదకరమైన ఆర్గానో ఫాస్పరస్ ఎక్కువగా కనిపించిందని వెల్లడించింది. మొత్తం 40 బ్లడ్ శాంపిల్స్ పరిశీలిస్తే 36 శాంపిల్స్ లో ఆర్గానో ఫాస్ఫరస్ మోతాదు అత్యధికంగా ఉందని తెలిపింది. వాటిలోనూ అర్గానో క్లోరిన్ ఎక్కడా కనిపించలేదని స్ఫష్టం చేసింది. 

గతంలో ఆక్వాకల్చర్ వల్ల ఈ తరహాలో కేసులు చైనాలో బయటపడినట్లు తెలుస్తోందంటూ సంచలన ప్రకటన చేసింది. తాగునీటి కలుషితం వల్ల కూడా అవకాశం ఉండచ్చని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదికలో పేర్కొంది.