ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. 

ఇక ఇప్పటి వరకు 612 మంది అనారోగ్యం పాలవ్వగా 569 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ఆస్పత్రిలో ఏడుగురు బాధితులు.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రత్యేక వార్డుల్లోని బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 

అంతుబట్టని అనారోగ్యం బారి నుంచి ఏలూరు కోలుకున్నా వ్యాధి నిర్ధారణ ఇంకా చిక్కుముడిగానే ఉంది. దీనిపై కేంద్ర బృందాలు ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మరోవైపు ఆరో రోజు గురువారం ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 14కి పరిమితమైంది. 

నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నా నిర్థారణ పరీక్షల ఫలితాల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరులో బాధితులను పరామర్శించి అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్ర బృందాలతో కూడా చర్చించారు.

బాధితుల్లో 24 గంటల అనంతరం సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణుల బృందం తెలిపింది. ఐఐసీటీ నిపుణులు కూడా వివిధ రకాల శాంపిళ్లు సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో) ప్రతినిధి బృందం ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేస్తూ నమూనాలు సేకరించింది. 

ఒకటి రెండు రోజుల్లో కచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిపుణుల బృందాలు చెబుతున్నాయి. ఏలూరులో తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, కలుషితం కాలేదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, విమ్టా ల్యాబ్‌ నివేదికలో వెల్లడైంది.