ఏలూరులో వింత వ్యాధితో వందల మంది అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు స్థానికంగా ఉండే నీటి నమూనాలను పరీక్షించారు. వాటిని విజయవాడలోని ఓ పరీక్షాకేంద్రంలో పరిశీలించగా ఆశ్చర్యపరిచే ఫలితాలు వెల్లడయ్యాయి.

ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరిశీలించగా హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరిమితికి మించి వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు.

కృష్ణా కాలువలో తీసుకున్న లీటరు నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాధారణంగా ఈ రసాయనం 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17 వేల 640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ రసాయనం ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

ఆహారం లేదా నీటి కాలుష్యం వల్లే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శాస్ర్తవేత్త జె.జె.బాబు వివరించారు. ప్రజలు అస్వస్థతకు గురికావడానికి వాతావరణంలో సమస్యలు ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.

బాధితుల నుంచి రక్త, మూత్ర తదితర నమూనాలను తీసుకున్నామని శాస్త్రవేత్తలు వివరించారు. బాధితులు ఉన్న ప్రాంతాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలోని నీరు, కూరగాయలు, ఆహార పదార్థాలను పరీక్షలకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక నివేదిక శుక్రవారం నాటికి వస్తుందని దానిని ప్రభుత్వానికి అందిస్తామని సదరు శాస్ర్తవేత్త తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ అస్వస్థతకు గురై 583 మంది ఆస్పత్రుల్లో చేరారు.

వీళ్లలో 470 మంది డిశ్చార్జి అయ్యారు. మెరుగైన చికిత్స కోసం 20 మంది రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. రోగుల నుంచి తీసుకున్న నమూనాల్లో నికెల్‌, సీసం ఉండటం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా తేల్చారు.