కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్‌ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అభ్యర్థి ఫోర్జరీ సంతకంతో నామినేషన్‌ ఉపసంహరించారన్న ఫిర్యాదుపై ఎస్‌ఈసీ ఈ చర్యలు తీసుకుంది.

టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ఆ పార్టీ ఎస్‌ఈకి ఫిర్యాదు చేసింది. దీంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఏడో డివిజన్‌ ఎన్నికను నిలిపివేసింది. అలాగే ఎన్నిక రద్దును వెంటనే అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించింది.  

కాగా మున్సిపోల్స్‌లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. ఆఖరు నిమిషం వరకే కాదు.. గడువు దాటాక కూడా కొన్ని చోట్ల ప్రత్యర్థుల నామినేషన్లు విత్‌డ్రా చేయించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్నీ జరిగాయి.

అన్ని జిల్లాల్లోనూ కీలకమైన మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. బెదిరింపులు, ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగా కొన్ని చోట్ల అభ్యర్థులే పోటీ నుంచి తప్పుకుంటే.. మరికొన్ని చోట్ల తప్పుడు పత్రాలతో నామినేషన్లు విత్‌డ్రా చేయించారు.

దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై కోర్టుకు వెళతామని టీడీపీ నేతలు అంటున్నారు.