సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం.. ఆటో మీద కరెంట్ తీగెలు తెగిపడి ఐదుగురు సజీవ దహనం..
అనంతపురంలో ఘోర ప్రమాద ఘటన జరిగింది. ఆటో మీద కరెంట్ వైర్లు తెగిపడడంతో ఎనిమిది సజీవదహనం అయ్యారు.
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై విద్యుత్ వైర్ తెగిపడటంతో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కొందరు చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు బయలుదేరారు. అయితే కూలీలు ప్రయాణిస్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో దానిపై విద్యుత్ వైర్ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా కాలి దగ్దం అయింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను ట్రాక్టర్‌లో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిపి 12 మంది వరకు ఉంటారని చెబుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాదంలో మరణించిన వారంతా మహిళలేనని గుర్తించారు. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో.. గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు.