రాష్ట్ర ప్రజానీకం అవసరాలు తీర్చటానికి సుమారు రూ. 7 వేల కోట్లు అవసరం. అయితే, బ్యాంకులు, ఏటిఎంల వద్ద ఉన్నది కేవలం రూ. 1500 కోట్లే.
అందరూ అనుకున్నట్లుగానే డిసెంబర్ 1వ తేదీ రానే వచ్చింది. వస్తూ వస్తూ మరింత ఆందళనను తెచ్చింది. జీతాలు, పెన్షన్ల డబ్బు కోసమని కొందరు, ఇంటి ఖర్చులు తదితరాల కోసం మామూలు ప్రజానీకం ఉదయం నుండి బ్యాంకులు ఏటిఎంల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. కేవలం జీతాలు, పెన్షన్లు మాత్రమే ఇస్తామని బ్యాంకులు చెప్పటంతో ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు-సాధారణ ప్రజానీకం మద్య బ్యాంకులు చిచ్చు పెట్టినట్లైంది.
అసలే, ప్రజావసరాలు తీర్చడానికి సరిపడా నగదు లేక ఇబ్బందులు పడుతున్న బ్యాంకులపైకి 1వ తేదీ కారణంతో ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ ప్రజానీకం ఒక్కసారిగా రావటంతో సమస్య మరింత తీవ్రమైంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రజానీకం అవసరాలు తీర్చటానికి సుమారు రూ. 7 వేల కోట్లు అవసరం. అయితే, బ్యాంకులు, ఏటిఎంల వద్ద ఉన్నది కేవలం రూ. 1500 కోట్లే.
రాష్ట్రవసరాలకు సరిపడా నగదును పంపాలని చంద్రబాబునాయడు రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ఆర్ధిక శాఖకు ఎన్ని లేఖలు రాసినా ఏమాత్రం ఉపయోగ కనబడలేదు. పైగా పంపుతున్న నగదులో కూడా రూ. 2 వేలు నోట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కావాల్సిందేమో రూ. 100 నోట్లు. దాంతో చిన్న నోట్లు లేక, పెద్ద నోట్లకు చిల్లర దొరకక ప్రజానీకం కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
చాలా బ్యాంకుల్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే నగదు ఇస్తామని బ్యాంకుల్లో బోర్డులు పెట్టటం గమనార్హం. దాంతో మరింత గందరగోళం మొదలైంది. బ్యాకుంలు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల అటు ఉద్యోగులు, పెన్షనర్లకు సాధారణ ప్రజానీకానికి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవసరాలు ఎవరికైనా ఓకటేనని ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పటాన్ని ప్రజానీకం అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై తిరుపతిలోని ప్రజలు బ్యాంకు అధికారులను నిలదీస్తుండటంతో పలు బ్యాంకుల వద్ద యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. గడచిన 22 రోజులకన్నా బ్యాంకులు, ఏటింఎంల వద్ద ప్రజల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోవటంతో చాలా చోట్ల రోడ్లపైకి జనాలు వచ్చేసారు. దాంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగిపోయాయి.
