ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీకి ఉచ్చు బిగుసుకుంటోంది. శ్రీనివాస గాంధీపై ఈడీ అధికారులు మనీల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. గాంధీ... భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నెల 8వ తేదీన శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్, విజయవాడలో రూ.200కోట్లు విలువచేసే అక్రమాస్తులు సంపాదించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. 2010 నుంచి 2019 వరకు శ్రీనివాస గాంధీ ఈడీ అధికారిగా పనిచేశారు. శ్రీనివాస గాంధీ ఆస్తులు 288శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. శ్రీనివాసగాంధీ అక్రమాస్తులను ఈడీకి ఎటాచ్ చేయనున్నారు. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సమన్లు కూడా జారీ చేశారు.

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. అప్పటి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న బొల్లినేని గాంధీతోపాటు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌ల‌పై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రోద్బలంతోనే గాంధీ తనపై తప్పుడు కేసులని బనాయించారని మోదీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.

ఈడీ కేసులతో ఏమాత్రం సంబంధం లేని తన భార్య భారతికి కూడా నోటీసులు జారీ చేశారని జగన్ ఆరోపించారు. ఈ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరిన జగన్.. తర్వాత మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జగన్ ఆరోపణల కారణంగానే గాంధీ జీఎస్టీకి బదిలీ అయ్యారని అప్పట్లో భావించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పని చేసిన గాంధీ.. తర్వాత ఈడీలో ఏడేళ్లపాటు పని చేశారు.

జగన్ అక్రమాస్తుల్లో కేసుల్లో ఆస్తులను అటాచ్ చేయడంలో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ, ఉమాశంకర్ గౌడ్ అత్యుత్సాహంతో వ్యవహరించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరూ జగన్ కేసుల సమాచారాన్ని చంద్రబాబుకు చేరవేసే వారని ఆరోపణలు ఉన్నాయి.