తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమీషన్.  సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమీషన్. ఏపీ విషయానికి వస్తే.. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల విషయానికి వస్తే ఆరు జిల్లాల్లో 331 పోలీంగ్ కేంద్రాల్లో .. 2 లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో గ్రాడ్యుయేట్.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. 

Also REad: టీచర్ , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బోగస్ ఓట్లపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఇక తెలంగాణ విషయానికి వస్తే 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనం కానుంది.