Earthquake : ప్రకాశం జిల్లా ఒంగోలు పరిసరాల్లో గత రాత్రి భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక నిద్రలోంచి మేల్కొన్న ప్రజలు రోడ్లపైకి పరుగుతీశారు. 

Earthquake : ఆంధ్ర ప్రదేశ్ లో గత రాత్రి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించింది. దీంతో భయంతో నిద్రలేచిన ప్రజలు ఇళ్లనుండి బయటకు పరుగుతీశారు. అయితే భూకంప తీవ్రత తక్కువే ఉండటంతో ప్రమాదం తప్పింది... కానీ ప్రజల్లో మాత్రం ఆ భయం ఇంకా కొనసాగుతోంది.

జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటన

ఒంగోలులో భూకంపనాలను జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (National Center for Seismology) కూడా నిర్దారించింది. ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి 2 గంటల 2 సెకన్ల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది... దీని తీవ్రత 3.4 గా ఉన్నట్లు వెల్లడించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.

Scroll to load tweet…

ఈ కాలనీల్లో భూకంప భయం

ఒంగోలు పట్టణంలోని గాయత్రి, విజయ్ నగర్, వడ్డెపాలెం, భాగ్యనగర్, శ్రీరామపురం కాలనీలతో పాటు సీఎస్ఆర్ శర్మ కాలేజ్ ప్రాంతాల్లో ప్రధానంగా భూకంప ప్రభావం కనిపించింది. మిగతా ప్రాంతాల్లో భూమి కంపించున్నా ఈ వార్త వ్యాప్తి చెందడంతో నగరవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. దీంతో చాలా కాలనీల్లో ముందుజాగ్రత్తగా ప్రజలు రోడ్లపైనే జాగరణ చేశారు. ఉదయం వరకు మళ్లీ ఎలాంటి ప్రకంపనలు చోటుచేసుకోకపోవడంతో ఒంగోలు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.