హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జననాల సంఖ్య తక్కువగా ఉన్నందున మహిళలు ఇద్దరిని మాత్రమే కాదు, నలుగురిని కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా నేలపాడులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆయన ఆ పిలుపునిచ్చారు. 

నాలుగున్నరేండ్లలో మహిళలకు పసుపు కుంకుమ కింద రూ.21,116 కోట్లు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా డ్వాక్రా సంఘాలను తానే తీర్చిదిద్దానని చెప్పుకున్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు రూ.10 వేల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ డబ్బును మూడువిడుతల్లో చెక్కులరూపంలో ఖాతాల్లో జమ చేస్తానని హామీ ఇచ్చారు. 

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో డ్వాక్రా గ్రూపు మహిళలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణ నాయకుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారని, వాళ్ల ఆటలు సాగనివ్వకూడదని ఆయన  అన్నారు.

పుట్టుక నుంచే ప్రభుత్వం మహిళలను జాగ్రత్తగా చూసుకుంటోందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల పరిమితి విధించారని, కానీ ఇప్పుడు జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనేలా యువతను ప్రోత్సహించాలని ఆయన అన్నారు.