అమరావతి: విద్య హక్కుచట్టాన్ని రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. విద్య, వైద్యానికి  తమ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

సోమవారం నాడు కలెక్టర్ల సదస్సులో  విద్య  శాఖపై  సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతను ,పెంచేందుకు అమ్మఒడి కార్యక్రమాన్ని  తీసుకొచ్చినట్టుగా జగన్ చెప్పారు. 

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్తాయిలో  అభివృద్ది చేస్తామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలు , పుస్తకాలు  సకాలంలో  అందిస్తామన్నారు.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామన్నారు. తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశాలు ఇస్తామని జగన్ చెప్పారు. విద్యను వ్యాపారం చేయకుండా చర్యలు తీసుకొంటామన్నారు. 

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో  25 శాతం సీట్లు పేదలకు చర్యలు తీసుకొంటామన్నారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నుండి అమ్మఒడి చెక్కులను పంపిణీ చేస్తామని సీఎం  ప్రకటించారు.