Asianet News TeluguAsianet News Telugu

తాజా ట్విస్ట్: వల్లభనేని వంశీపై పోరుకు రూట్ మార్చిన దుట్టా

గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒంటరి చేయాలనే వ్యూహంతో వైసీపీ నాయకుడు దుట్టా రామచందర్ రావు ముందుకు సాగుతున్నారు. వంశీ ఆయన వ్యూహానికి ప్రతివ్యూహం రచిస్తూ అమలు చేస్తున్నారు.

Dutta Ramachandar Rao strategy to fight against Vallabhaneni Vamsi
Author
gannavaram, First Published Aug 22, 2020, 11:53 AM IST

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచందర్ రావుకు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వల్లభనేని వంశీని ఎదుర్కోవడానికి దుట్టా వర్గం కొత్త వ్యూహం రచించి అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వంశీని నియోజకవర్గంలో ఒంటరిని చేయాలనేది దుట్టా ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో యార్లగడ్డ వెంకటరావు వర్గాన్ని చేరదీయాలని చూస్తున్నారు. 

వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీ శుక్రవారం చేసిన ఓ ప్రకటన కలకలం రేపుతోంది. దుట్టా రామచంద్రరావుతో తనకు విభేదాలు లేవని ఆయన చెప్పారు. అయితే, అదే సమయంలో తానే ఎమ్మెల్యేను, పార్టీ ఇంచార్జీని అని చెప్పారు. దానిపై దుట్టా వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం వంశీ స్వయంగా దుట్టా ఇంటికి వెళ్లారు. తాను నిర్వహించే గ్రామ సభలకు రావాలని ఆహ్వానించారు. అయితే, ఆ ఆహ్వానాన్ని దుట్టా తిరస్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద తేల్చుకున్న తర్వాతనే మాట్లాడుతానని దుట్టా తేల్చి చెప్పారు. 

ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఓ సంఘటన తీవ్ర ఆసక్తికి కారమైంది. పశు సంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు దు్టటా రామచంద్రరావును కలిశారు. దుట్టా నివాసం ఉండే వీధిలోనే వైసీపీ నాయకుడు దయాల విజయనాయుడి ఇంటి వద్ద వంశీ కార్యకర్తలతో భేటీని ఏర్పాటు చేశారు. విజయనాయుడి ఇంటి వద్దకు పెద్ద యెత్తున వంశీ అనుచరులు వచ్చారు. 

దుట్టా ఇంటి నుంచి మంత్రి అప్పలరాజు తిరిగి వెళ్తున్న సమయంలో వంశీ అనుచరులు అడ్డుపడ్డారు. వంశీ కారు దిగి మంత్రి అభివాదం చేశారు. మంత్రి అప్పలరాజు వంశీని పలకరించారు. ఈ సంఘటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

గన్నవరం నియోజకవర్గంలో తన అల్లుడు శివభరత్ రెడ్డి ప్రాబల్యాన్ని పెంచాలని దుట్టా అనుకుంటున్నారు. అందుకు వంశీని బలహీనపరచాల్సి ఉంటుంది. అందులో భాగంగా దుట్టా, శివభరత్ రెడ్డి వైసీపీ నేతలను కలుస్తున్నారు. వంశీ వర్గానికి సమాంతరంగా తమ వర్గాన్ని వాళ్లు పెంచుకుంటున్నారు. ఇది ఎంత వరకు వెళ్తుందనేది వేచి చూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios