గన్నవరం: కువైట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్న వివాహిత పి. దుర్గ నాలుగు రోజులుగా కన్పించకుండా పోయింది.ఈ విషయమై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుర్గ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గ వద్ద నగదు, నగలు ఉన్నాయని భర్త చెబుతున్నారు.

కువైట్ నుండి తాను త్వరలోనే బయలుదేరుతానని తన భార్య దుర్గ గత మాసంలో ఫోన్ చేసిందన్నారు. కరోనా పరీక్షలు పూర్తైన తర్వాత తాను బయలుదేరే ముందు ఫోన్ చేస్తానని చెప్పిందని భర్త సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కువైట్  నుండి తన భార్య స్నేహితురాలు ఈ నెల 17వ తేదీన తనకు ఫోన్ చేయడంతోనే తన భార్య ఇండియాకు వచ్చినట్టుగా తెలిసిందని సత్యనారాయణ తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు.

పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో సీసీపుటేజీని పరిశీలించారు. ఈ పుటేజీ ఆధారంగా ఈ నెల 16వ తేదీన దుర్గ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్నట్టుగా దృశ్యాలు రికార్డయ్యాయి. 

వాహనాలు వెళ్లే ప్రాంతం వరకు దుర్గ దృశ్యాలు కన్పించాయి. అయితే అక్కడ సీసీటీవీ పనిచేయకపోవడంతో  దుర్గ ఎక్కడికి వెళ్లిందనే విషయమై స్పష్టత రాలేదని సత్యనారాయణ చెప్పారు.

ఈ విషయమై పోలీసులు కూడ గాలింపు చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. నాలుగు రోజులుగా తన భార్య ఆచూకీ కోసం తాను వెతుకుతున్నానని ఆయన వివరించారు.

దుర్గ చాలా కాలంగా కువైట్ లో పనిచేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలు అక్కడ పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చింది. వంట పని, ఇంటి పనులు చేసేదని భర్త సత్యనారాయణ చెప్పారు.

 సత్యనారాయణకు ఆయన భార్య దుర్గ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  దుర్గను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. ఆమె ఎక్కడికైనా వెళ్లిందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.