హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెడుతున్న దురంతో ఎక్స్ ప్రెస్ భీమడోలు దగ్గర బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రైలు ఇంజిన్ దెబ్బతిన్నది.
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద దురంతో ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దురంతో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఐదు గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. బొలెరో వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. భీమడోలు జంక్షన్ దగ్గర గురువారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో దురంతో ఎక్స్ప్రెస్ వస్తుందని తెలియడంతో సిబ్బంది రైల్వే గేట్ మూసేశారు.
ఆ సమయంలో బొలెరో వాహనంలో అక్కడికి వచ్చిన కొంత మంది వ్యక్తులు.. ఎలాగైనా రైలు గేటును దాటిపోవాలని ప్రయత్నించారు. రైల్వే గేటును తమ వాహనంతో ఢీ కొట్టి వెళ్లాలని చూసారు. అదే సమయంలో దూరంతో ఎక్స్ప్రెస్ ట్రాక్ మీదకి వచ్చింది. రైలును చూసిన వాహనదారులు వెంటనే భయంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. దీంతో వేగంగా వచ్చిన దురంతో ఎక్స్ప్రెస్ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బోలేరో తీవ్రంగా ధ్వంసం అయింది. రైలు ఇంజన్ కూడా దెబ్బతింది. ప్రమాదం సమాచారం తెలియడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరో ఇంజన్ ను అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు.. జగన్ ఢిల్లీ పర్యటనకు మూలం అదే.. రఘురామ
ఈ ప్రమాదం నేపథ్యంలో దురంతో ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. రైల్వే పోలీసులు ఈ ప్రమాద ఘటన మీద విచారణ చేపట్టారు. బొలెరో వాహనంలో వచ్చిన వారు ఎవరు? ఎందుకు పారిపోవాలి అనుకున్నారు? వారు దొంగలా? ఏదైనా నేరం చేసి పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా, మార్చి 21న నెల్లూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ఏపీలోని నెల్లూరులో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ వద్ద ఏసీ కోచ్ కు ‘హాట్ యాక్సిల్’ అయింది. వెంటనే ఆ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది.. రైలు నుంచి ఆ భోగిని తొలగించారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన బిట్రగుంట స్టేషన్ వద్ద తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగింది. బోగీ తొలగించి.. వేరే భోగిని అటాచ్ చేసిన తర్వాత నాలుగు గంటల సమయంలోశేషాద్రి ఎక్స్ప్రెస్ తిరిగి బెంగళూరుకు బయలుదేరింది. ఇది ఏసీ బోగీ. దీంట్లోనే ప్రయాణికులను పద్మావతి ఎక్స్ప్రెస్ లో సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
