Asianet News TeluguAsianet News Telugu

దుగ్గిరాల : ఇంటికి చేరిన ఎంపీటీసీ పద్మావతి.. క్యాంప్‌కి వెళ్లా, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదంటూ వీడియో

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కిడ్నాప్ అయ్యారంటూ ప్రచారం జరిగిన ఎంపీటీసీ పద్మావతి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. పార్టీ ఆదేశం మేరకు క్యాంప్‌కి వెళ్లానని పద్మావతి ఓ వీడియోను విడుదల చేశారు. 

duggirala mptc padmavathi clarity on her kidnap
Author
Duggirala, First Published May 5, 2022, 10:10 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే అధికార వైసీపీకి చెందిన పద్మావతి అనే ఎంపీటీసీ అదృశ్యం కావడం కలకలం రేపింది. తన తల్లిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కిడ్నాప్ చేశారంటూ పద్మావతి కుమారుడు యోగేందర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో ఆమె కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధ‌వారం నుంచి వినిపిస్తున్న వార్త‌ల‌పై స‌స్పెన్స్ వీడిపోయింది. 

గురువారం మ‌ధ్యాహ్నం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పూర్తయ్యాక సాయంత్రం వేళ పద్మావతి క్షేమంగా త‌న ఇంటికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అదృశ్యంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను విడుద‌ల‌ చేశారు. పార్టీ ఆదేశాలతో తాను క్యాంప్‌లో వున్నానని .. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని స్పష్టం చేశారు. సంతోషి రూపావాణిని ఎంపీపీగా ఎన్నుకున్నామని పద్మావతి చెప్పారు. స్వ‌యంగా ప‌ద్మావ‌తి నుంచే వీడియో రూపంలో క్లారిటీ రావ‌డంతో ఆమె కిడ్నాప్‌న‌కు గురైంద‌న్న ప్ర‌చారానికి తెరపడింది. 

అంతకుముందు ఏపీలో అధికార వైసీపీకి (ysrcp) చెందిన కీల‌క నేత‌, గుంటూరు జిల్లా (guntur district) మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై (alla rama krishna reddy) పద్మావతి కుమారుడు యోగేందర్ నాథ్ సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. దుగ్గిరాల ఎంపీపీ (duggirala mpp election) ఎన్నిక నేప‌థ్యంలో దుగ్గిరాల 2 ఎంపీటీసీగా గెలిచిన త‌న త‌ల్లి ప‌ద్మావ‌తిని ఎమ్మెల్యే ఆర్కే అనుచ‌రులు అప‌హ‌రించార‌ని ఆరోపించారు. 

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో చ‌తికిల‌బ‌డిన టీడీపీ (tdp) దుగ్గిరాల‌లో మాత్రం సత్తా చాటింది. అయితే అనూహ్య ప‌రిణామాల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా ప‌డింది. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎంపీపీ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక గురువారం నాడు జ‌ర‌గ‌నుంది. దుగ్గిరాలలో మెజారిటీ ఎంపీటీసీల‌ను టీడీపీ గెలుచుకున్నా... ఎక్స్ అఫీసియో ఓట్ల‌తో ఎంపీపీ ప‌ద‌విని కైవ‌సం చేసుకునేందుకు వైసీపీ పావులు కదిపింది.

ఇలాంటి త‌రుణంలో ఎంపీపీ ప‌ద‌విని ఆశిస్తున్న ప‌ద్మావ‌తికి వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేదు. ఆమెకు బదులు మరో అభ్య‌ర్థిని ఎంపీపీగా ఎన్నిక చేసేందుకు వైసీపీ స‌న్నాహాలు పూర్తి చేసింది. దీంతో రెబ‌ల్‌గా అయినా పోటీ చేసేందుకు ప‌ద్మావ‌తి సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌లు పార్టీలో జోరుగా వినిపించాయి. దీంతో ప‌ద్మావ‌తిని ఆర్కే అనుచ‌రులు అపహరించారని ఆమె కుమారుడు యోగేంద‌ర్ నాథ్ ఆరోపిస్తున్నారు. త‌న త‌ల్లికి ఎంపీపీ ప‌ద‌విపై ఆశ లేద‌ని చెప్పిన యోగేంద‌ర్‌... త‌న త‌ల్లి ఎక్క‌డుందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. త‌న త‌ల్లికి ఏదైనా జ‌రిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్సైలే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంద‌ని యోగేంద‌ర్ నాథ్ హెచ్చ‌రించారు. ఈ నేపథ్యంలో పద్మావతి క్షేమంగా ఇంటికి చేరడంతో కథ సుఖాంతమైంది.

 

"

Follow Us:
Download App:
  • android
  • ios