విజయవాడ: దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మొదట వ్యాక్సిన్ ను ప్రయోగాత్మకంగా అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో డ్రై రన్ నిర్వహించేందుకు సిద్దమైంది. 

రేపటి(సోమవారం) నుండి కృష్ణా జిల్లాలో ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్తి, ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పూర్ణా హార్ట్ ఇన్సిట్యూట్ (ప్రైవేట్ వైద్య కేంద్రం) సూర్యారావు పేట, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం, పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రకాశ్ నగర్ యుపిహెచ్‌సి లో ఈ వ్యాక్సిన్ ను అందించనున్నారు.

డ్రై రన్ సన్నాహక చర్యల్లో భాగంగా వాక్సినేషన్ కు అవసరమైన ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని ఇప్పటికే గుర్తించి ఆ జాబితాను Co WIN యాప్లో అప్లోడ్ చేశారు. అలాగే వ్యాక్సినేషన్ లబ్దిదారుల జాబితాలను కూడా రూపొందించి Co-WIN యాప్లో అప్ లోడ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల పరిస్థితులు(AEFI) ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే AEFI- చికిత్సా కేంద్రాల జాబితాను రూపొందించారు. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు రెండు రోజులపాటు శిక్షణనిచ్చారు.

28వ తేదీన నిర్వహించే డ్రైరన్ ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరించి కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర, స్థాయి టాస్స్ ఫోర్స్ లకు అందచేయటం వంటి చర్యలున్నాయి. వాక్సినేషన్ అధికారులుగా సంబధిత సచివాలయంలోని 1) మహిళ పోలీస్ 2)డిజిటల్ అసిస్టెంట్ 3) A.N.M. 4) అంగన్వాడి వర్కర్ మరియు 5) ఆశా వర్కర్ లను నియమించడం జరిగింది.

జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.