ఇద్దరు మహిళలపై ఉన్మాది కత్తితో దాడికి పాల్పడిన ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో చోటుచేసుకుంది.  

అమలాపురం : కోనసీమ జిల్లాలో ఓ ఉన్మాది రక్తపాతం సృష్టించారు. మద్యంమత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తాగుబోతు ఇద్దరు మహిళలపై కత్తితో దాడిచేసాడు. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా మరో మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురం ఏఎంజీ కాలనీకి చెందిన కమ్మిండి వెంకటరమణ(42) ఇంట్లో మన్నె శ్రీదేవి(30) పనిచేస్తూ వుంటుంది. రోజూ మాదిరిగానే మంగళవారం మధ్యాహ్నం వెంకటరమణ ఇంట్లో బట్టలు ఉతికేసిన శ్రీదేవి వాటిని మేడపై ఆరేసేందుకు వెళ్లింది. ఆమెకు సహాయం చేసేందుకు వెంకటరమణ కూడా మేడపైకి వెళ్ళింది. 

మహిళలిద్దరూ మేడపై వుండగా నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ(30) మత్తులో మహిళలున్న మేడపైకి వెళ్ళాడు. వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీదేవిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో రక్తపుమడుగులో కుప్పకూలిన శ్రీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే వున్న వెంకటరమణపై కూడా ఉన్మాది దాడిచేసాడు. కానీ ఆమె అతడి నుండి తప్పించుకుని గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు అక్కడికి చేరుకుని ఉన్మాదిని పట్టుకుని చెట్టుకుకట్టేసి చితకబాదారు. 

Read More కుక్కల దాడిలో మామిడి రైతు మృతి.. తోటకు కాపాలాగా వెడితే కరిచి చంపాయి...

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఉన్మాదిని అరెస్ట్ చేసారు. అతడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గాయపడిన మహిళను చికిత్స కోసం అమలాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.