మద్యం మత్తులో ఓ పోలీస్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి.. వారిపై దుర్భాషలాడాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జేమ్స్ నెల్లూరులో నివాసం ఉంటున్నాడు. కాగా... శుక్రవారం జేమ్స్ పీకలదాకా మద్యం తాగి రోడ్డుపై నానా రచ్చ చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ కానిస్టేబుల్.. ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఇంట్లో ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

భద్రతా సిబ్బందిని నెట్టుకొని సైతం ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించాడు. అందరినీ నోటికి వచ్చినట్లు తిడుతూ నానా యాగీ చేశాడు. అతడిని బయటకు తీసుకురావడం భద్రతా సిబ్బది తరం కాలేదు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జేమ్స్ ని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ని ఇబ్బంది పెట్టినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు.  కాగా.. కానిస్టేబుల్ తీరుపై స్థానికులు సైతం మండిపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.