మద్యం మత్తులో కన్నబిడ్డలను రోడ్డుపై వదిలేశారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు చిన్నారులు స్థానికులకు ఏడుస్తూ కనిపించారు.

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారులను స్టేషన్‌కు తరలించి, చైల్డ్‌ కేర్ అధికారులకు సమాచారం అందించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఓ గిరిజన జంట మద్యం మత్తులో రోడ్డు పక్కన స్పృహలేని స్థితిలో ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా తమది ఒడిశా రాష్ట్రం పొట్టంగి గ్రామానికి చెందిన వారమని, తమ పేర్లు కుంబి, కిమ్మయ్య అని తెలిపారు. అనంతరం పోలీసులు పిల్లల గురించి చెప్పగా.. వారు తమ పిల్లలేనని చెప్పారు. అనంతరం వారికి మత్తు దిగే వరకు స్నానాలు చేయించి, చిన్నారులను వారికి అప్పగించారు.