వార్నీ.. కోడిని కుక్క కరిచిందని.. ఘర్షణకు దిగిన టీడీపీ, వైసీపీ.. రెండు వర్గాలపై కేసులు..
కోడిని కుక్క కరిస్తే.. అది రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో వెలుగు చూసింది.

వైయస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఉప్పు, నిప్పుగా ఉండే వైసీపీ టిడిపిల మధ్య ఘర్షణకు.. కుక్క, కోడిలు కారణమయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలంలోని మాధవరం ఒకటి గ్రామంలో ఓ కోడిని.. కుక్క గాయపరిచింది. దీనిమీద.. స్థానిక వైసిపి టిడిపి వర్గాలు ఘర్షణకు దిగాయి.
దీంతో పోలీసులు కలగజేసుకొని ఇరువర్గాలపై కేసును నమోదు చేశారని ఎస్సై తులసి నాగప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. మాధవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు చలపాటి చంద్రకు ఓ కోడి ఉంది. దీనిమీద శనివారం సాయంత్రం వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి పెంచుకుంటున్న కుక్క దాడి చేసింది.
భర్తను వశం చేసుకోవడం కోసం మంత్రగాడి హత్య.. రెండో భార్యమీద నేరం నెట్టి..చివరికి..
దీంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో చలపాటి చంద్రకు గాయాలయ్యాయి. ఆయనను కడప సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న చలపాటి చంద్రను టిడిపి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగముని రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు, బీసీ సెల్ అధికార ప్రతినిధి జింకా శివ.. పలువురు నాయకులు పరామర్శించారు. గొడవకు సంబంధించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
బాధితుడైన చలపాటి చంద్ర ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డి ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డిలతోపాటు మరికొందరి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, చలపతి చంద్ర నారాయణరెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి తిడుతుండడంతో.. తాను ప్రశ్నించానని.. దీంతో అతను తన కులం పేరుతో దూషించాడు అంటూ నెకనాపురం నివాసి చిన్న నాగయ్య చంద్ర మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చలపాటి చంద్రపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది.