హైదరాబాద్: నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధాని అవుతారనేది తమకు ముఖ్యం కాదని, వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే వారికే తన మద్దతు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న ఆయన ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధితో మాట్లాడారు. 

తాము అధికారంలోకి వస్తే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెసు ఇచ్చిన హామీపై ప్రతిస్పందిస్తూ... గతానుభవం దృష్ట్యా తాము ఎవరినీ నమ్మలేమని, వారు అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. 

బిజెపితో తనకు రహస్య ఒప్పందం ఉందనే విమర్శలపై ప్రశ్నించినప్పుడు అంశాలవారీగా తాము మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవికి పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిచ్చినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్నికల్లో తాము టీడీపి అభ్యర్థి కోడెల శివప్రసాద్ కు మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హంగ్ అసెంబ్లీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు మెజారిటీ వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి సమకూరే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు.