ఆవనిగడ్డ: కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో దారుణం చోటు చేసుకొంది. రోగి బంధువుల్లా వచ్చి ఓ డాక్టర్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు.  డాక్టర్ నివాసంలో నగదు, బంగారాన్ని చోరీ చేశారు. 

కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో శ్రీహరిరావు  ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు.  ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ ఖమ్మం, హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు. పిల్లలిద్దరూ కూడా డాక్టర్లు.

శ్రీహరి రావు తాను నివాసం ఉంటున్న ఇంట్లో కింది అంతస్తులో ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. పై అంతస్తులో కుటుంబంతో ఆయన నివాసం ఉంటున్నాడు.

శ్రీహరి రావు ప్రతి రోజూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆసుపత్రికి వచ్చి రోగులను పరీక్షిస్తుంటాడు. అయితే శనివారం నాడు  ఉదయం పది గంటలైనా కిందకి రాకపోవడంతో పై అంతస్తులో శ్రీహరి రావు ఇంట్లోకి నర్సు వెళ్లి చూసింది. డాక్టర్ రక్తపు మడుగులో ఉండడాన్ని చూసి  ఆమె కుటుంబసభ్యులకు , పోలీసులకు సమాచారం ఇచ్చింది.

డాక్టర్ శ్రీహరిరావు ఇంట్లో నగదు, బంగారం ఉన్న విషయాన్ని గుర్తించి దోపీడీకి ప్లాన్ చేసి ఆయనను హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు.వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా ఆయన చేస్తుంటాడు. పనిమనుషులను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పనులను నిర్వహిస్తున్నాడు.

ఇంట్లో ఒక్కడే ఉన్న విషయం తెలుసుకొన్న దుండగులు  రోగి బంధువుల మాదిరిగా ఆసుపత్రిలోకి చొరబడి డాక్టర్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమను గుర్తించకుండా  ఉండేందుకు గాను దుండగులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చోరీకి ప్రయత్నించిన దుండగులను డాక్టర్ ప్రతిఘటించడంతో ఆయనపై దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

డాక్టర్ నివాసంలో  బంగారం, నగదు ఎత్తుకెళ్లారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడినవారెవరనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.