అమరావతి: తనను వేధించిన ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ డాక్టర్  అనితా రాణి సోమవారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చిత్తూరు జిల్లాలోని పెనుమూరు పీహెచ్‌సీలో డాక్టర్ అనితారాణి పనిచేస్తున్నారు. వైసీపీ నేతలు తనను వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. డాక్టర్ అనితారాణిపై వైసీపీ నేతల వేధింపులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు.

also read:డాక్టర్ అనితారాణి వివాదం: విచారణకు చిత్తూరుకు చేరుకొన్న సీఐడీ

ఈ విషయమై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ అనితారాణి డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు.
సీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని డాక్టర్ అనితారాణి ప్రకటించారు. సీఐడీ అధికారులు విచారణకు వచ్చిన సమయంలో ఆమె ఇంటికి తాళం వేసుకొన్నారు. ఫోన్ లో సీఐడీ అధికారులకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.

సీఐడీ విచారణ నిష్పక్షపాతంగా లేదని డాక్టర్ అనితారాణి ఆరోపించారు. తనపై వేధింపుల కేసును విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.