విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్న ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు డీఎంకే చీఫ్ స్టాలిన్ విజయవాడ చేరుకున్నారు. తమిళనాడు నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. 

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న స్టాలిన్ కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి డీఎంకే చీఫ్ స్టాలిన్ నేరుగా విజయవాడ బయలుదేరారు. విజయవాడలోని తాజ్ గేట్ వే హోటల్ కు చేరుకున్నారు. 

తాజ్ గేట్ వే హోటల్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి దుర్గ గుడికి చేరుకోనున్నారు. కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ఆయన వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. 

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ అతిధిగా హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం స్టాలిన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో రాత్రి 7 గంటలకు భారత ప్రధానిగా నరేంద్రమోదీ చేయబోయే ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.