తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ పరిణామాలను డీకే అరుణ స్పందించారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించడం తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఈ పరిణామాలను డీకే అరుణ స్పందించారు. ఈ కేసుల వెనక కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్‌ల కుట్ర ఉందని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్య కుట్ర అనేది ఒక పచ్చి అబద్దం అని చెప్పారు. తన ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్లపై రాళ్లు వేయడం ఏం రాజకీయం అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎదురుగా కొట్లాడాలని సవాలు విసిరారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు. సీబీఐతో పాటు అన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని కోరతామని చెప్పారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. పులిలా ఉండే స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులు పిల్లిలాగా మారుతున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతోన్న వారికి కచ్చితంగా షల్టర్ ఇస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక... ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందని ఆరోపించారు.
ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కొందరు వ్యక్తులు ఈసీకి ఫిర్యాదు చేశారని.. దీన్ని ఆయన తట్టుకోలేకపోయారని అన్నారు. కబ్జాలు, అవినీతిపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న యువకులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఇది ఒక రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మంత్రి సానుభూతి కోసమే హత్యకు కుట్ర అని డ్రామా చేస్తున్నారని విమర్శించారు.
ఇక, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను భగ్నం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెస్ రవీంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. హత్యకు పన్నిన కుట్రను ఆదిలోనే భగ్నం చేశామని తెలిపారు. పలువరిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. ఈ కేసులో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్‌లోని బీజేపీ నాయకులు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇళ్లపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను జితేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. డీకే అరుణ ఇంటిపై రాళ్లు, టైర్లు విసిరి దాడి చేశారు. ఈ దృశ్యాలను డీకే అరుణ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
