రాజీనామా చేసి, అనంతరం ట్వీట్ డిలీట్ చేసి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన దివ్యవాణి బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తప్పుడు ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు ఆమెకు సూచించారు.

సినీనటీ, టీడీపీ (tdp) అధికార ప్రతినిధి దివ్యవాణి (divya vani) రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసిన దివ్యవాణి ఆ వెంటనే దానిని డిలీట్ చేశారు. ఈ క్రమంలో బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) దివ్యవాణి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు జరిగిన అవమానాలను, ఇబ్బందులను ఆయనకు ఆమె వివరించారు. 

చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరబడి ట్వీట్ పెట్టానని.. తప్పుడు ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారని దివ్యవాణి తెలిపారు. పార్టీలో ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని.. టీడీపీలో చేరిన నాటి నుంచి తన వంతు కృషి చేశానని ఆమె వెల్లడించారు. 

ALso Read: దివ్యవాణి రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్.. ట్వీట్ డిలీట్.. అసలేం జరిగిందంటే..

కాగా.. మహానాడు (tdp mahanadu) తర్వాత ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యవాణి.. తనకు అవమానం జరిగిందని ఆరోపించారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె ట్విట్టర్ అకౌంట్‌లో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న దివ్యవాణి.. రాజీనామా చేసినట్టుగా చాలా మంది భావించారు. అయితే కొద్దిసేపటికే దివ్యవాణి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. దీంతో ఆమె రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పార్టీని రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారా..?, లేక పార్టీలోనే కొనసాగుతున్నారా..? అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దివ్యవాణి టీడీపీని వీడటం లేదని కొన్ని మీడియా సంస్థలకు తెలియజేశారు.

దివ్యవాణి ట్విట్టర్‌లో రాజీనామా చేస్తున్నట్టుగా పోస్టు చేయడానికి ఓ ఫేక్ మెసేజ్ కారణంగా తెలుస్తోంది. టీడీపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్టుగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చక్కర్లు కొట్టింది. ఆ పోస్టు చూసి.. దాని ఆధారంగానే రాజీనామా చేస్తున్నట్టుగా పోస్టు చేశానని దివ్యవాణి చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, బచ్చుల అర్జునుడితో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన ట్వీట్‌ను డిలీట్ చేసినట్టుగా సమాచారం. గతంలో కూడా కొందరు పార్టీ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టారని గుర్తుచేసింది. పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కూడా గతంలో తప్పుడు పోస్టులు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.