తిరుమలను కంటైన్మెంట్ జోన్‌లో తీసుకున్నట్లు ప్రకటించిన జిల్లా అధికారులు గంట వ్యవధిలోనే మాట మార్చారు. హఠాత్తుగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు.. 3.45 గంటల సమయంలో తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో భక్తుల దర్శనాలకు ఆటంకాలు తొలగిపోయాయి.

భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. తిరుమల కంటైన్మెంట్ జోన్ విషయంలో టీటీడీని సంప్రదించకుండానే జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది.

శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతమున్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకునే టీటీడీ భక్తులకు దర్శన టికెట్లను జారీ చేసింది. జూలై నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ప్రతి నిత్యం 9 వేల టికెట్లను ఇప్పటికే విక్రయించింది.

అలాగే సర్వదర్శనానికి సంబంధించి ఆఫ్‌లైన్ టికెట్లకు సంబంధించి ముందు రోజే జారీ చేస్తోంది. కరోనా విషయంలో టీటీడీ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది. అలిపిరి వద్దే థర్మల్ స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.