Asianet News TeluguAsianet News Telugu

తన మందీ మార్భలాన్ని అడ్డుకున్నారని... ఎయిర్ పోర్టు అధికారులకు చుక్కలు చూపించిన ఎమ్మెల్యే తనయుడు

తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి నిర్వాకంతో ఎయిర్ పోర్ట్ తో పాటు విమానాశ్రయ సిబ్బంది నివాస సముదాయాలకు మంచి నీటి పరఫరా నిలిచిపోయింది. 

disruption in water supply to Tirupati airport and staff quarters
Author
Tirupati, First Published Jan 13, 2022, 5:08 PM IST

తిరుపతి: అతడు అధికార పార్టీ ఎమ్మెల్యే సుపుత్రుడే కాదు తిరుపతి డిప్యూటీ మేయర్ కూడా. ఆయన తన మందీమార్భలంతో మంత్రికి స్వాగతం పలకడానికి వెళితే ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఇలా తన అనుచరులు, ఇతర నాయకుల ముందే అడ్డుకోవడంతో ఎమ్మెల్యే తనయుడి ఈగో హర్ట్ అయినట్లుంది. దీంతో తన అధికారాన్ని ఉపయోగించి ఎయిర్ పోర్ట్ అధికారులు, ఉద్యోగులకే కాదు ప్రయాణికులు చుక్కలు చూపించాడు. 

వివరాల్లోకి వెళితే... ఇటీవల తిరుపతి (tirupati) లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం టిటిడి (TTD) ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి (yv  subbareddy)తో కలిసి మంత్రి బొత్స విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి (renigunta airport) చేరుకున్నాడు. వారికి స్వాగతం పలికేందుకు స్థానిక వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (bhumana karunakar reddy)తో పాటు ఆయన తనయుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి (abhinay reddy) కూడా  విమానాశ్రయానికి వెళ్లారు. 

అయితే భారీగా అనుచరులు, కార్యకర్తలతో అభినయ్ రెడ్డి విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని ఎయిర్ పోర్ట్ మేనేజర్ సునీల్ అడ్డుకున్నారు. ఇంతమందిని ఎయిర్ పోర్ట్ లోపలికి పంపించడం కుదరదని సునీల్ అడ్డుకోవడంతో అభినయ్ రెడ్డి, వైసిపి నాయకులు వాగ్వాదానికి దిగారు. 

ఈ వ్యవహారంతో అభినయ్ రెడ్డికి కాలినట్లుంది. దీంతో విమానాశ్రయ సిబ్బందికి తన ప్రతాపమేంటో తెలియజేయాలని అతడు భావించినట్లున్నాడు. ఇంకేముంది తన తండ్రి పలుకుబడి, తన అధికారాలను ఉపయోగించి ఎయిర్ పోర్టుకే కాదు సిబ్బంది నివాసగృహాలకు కూడా తాగునీటి సరఫరా నిలిపివేసారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నివాసగృహాలకు నీటి ట్యాంకర్ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గుంత తవ్వించి ఇబ్బందికి గురిచేసారు. అంతేకాదు డ్రైనేజీ సమస్యను కూడా సృష్టించినట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది వాపోయారు. 

దీంతో విమానాశ్రయ ప్రయాణికులతో పాటు సిబ్బంది తీవ్ర ఇబ్బందుకులకు గురయ్యారు. తమ సమస్యను పరిష్కరించాలని తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ (tirupati municipal corporation) కార్యాలయానికి వెళ్లి కమీషనర్ గిరీషను విన్నవించుకున్నారు. డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఇదంతా చేసాడని విమానాశ్రయ సిబ్బంది వాపోతున్నారు.

తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ తీరును ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఘటనపై స్పందిస్తూ... వైసిపి అధినేత పెద్ద సైకో అయితే పార్టీ నేతలు, వారి కుమారులు చిన్న సైకోలని ఎద్దేవా చేసారు. ఆయన విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడరైతే వీళ్లు అరాచకానికి ప్రతిరూపాలని లోకేష్ మండిపడ్డారు. 

''తిరుపతి ఎయిర్ పోర్టులో మంత్రి గారికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు అభినయ్ రెడ్డి అనుచరులకు పాస్ ఇవ్వలేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా విమానాశ్రయంతో పాటు సిబ్బంది క్వార్టర్లకు నీటి సరఫరా ఆపేయడం వైసిపి అరాచక పాలనకు నిదర్శనం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బరితెగించి ప్రవర్తిస్తున్న వైసిపి అరాచక శక్తులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది'' అని లోకేష్ హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios