తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసులో దిశా పోలీసులు గురువారం ఛార్జీషీటును దాఖలు చేశారు.

నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వచ్చిన నాగేంద్ర ఆమెను కత్తితో పొడిచాడని, అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడని పోలీసులు ఛార్జీషీటులో దాఖలు చేశారు.

దివ్యను హత్య చేసిన తర్వాత అరగంట పాలు ఆమె గదిలోనే నాగేంద్ర ఉన్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో దివ్య తల్లి గదిలోకి రావడంతో తనను తాను గాయపరుచుకున్నాడని పేర్కొన్నారు.

ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలో హత్య జరిగినట్లు తేలిందని పోలీసులు ఛార్జ్‌షీటులో వెల్లడించారు. కాగా, విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజస్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.