విజయవాడ నుంచి ముంబయికి నేరుగా విమానం... ఎంపీ బాలశౌరి చొరవతో ఏపీవాసులకు డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కృషి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ఏర్పడింది. ఇప్పటివరకు విజయవాడ నుంచి ముంబయికి లేని విమాన సర్వీసు బాలశౌరి చొరవతో అందుబాటులోకి వచ్చింది.
విజయవాడ నుంచి ముంబయికి నేరుగా విమాన సర్వీస్ ఇప్పటివరకు లేదు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో తాజాగా అందుబాటులోకి వచ్చింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విజయవాడ-ముంబయి ఫ్లైట్ సర్వీసును విజయవాడ విమానాశ్రయంలో ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి జ్యోతి వెలిగించి రిబ్బన్ కత్తిరించి నూతన సర్వీసుకు శ్రీకారం చుట్టారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మొదటి బోర్డింగ్ పాస్‌ను ప్రయాణికులకు అందజేశారు ఎంపీ బాలశౌరి. ముంబయి నగరానికి మన రాజధాని అమరావతి నుంచి విమాన సర్వీస్ తీసుకురావాలని కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయని ఈ సందర్భంగా తెలిపారు. ముంబై నగరానికి సర్వీస్ రావడం వల్ల విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని నూతన విమాన సర్వీసులను గన్నవరం నుంచి నడిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, గన్నవరం నుంచి కోల్‌కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపేలా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించారు. వారానికి రెండు రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త ఫ్లైట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ- సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక సర్వీసులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న కొత్త టెర్మినల్ భవనం నిర్మాణాన్ని సైతం త్వరలోనే పూర్తి చేస్తామని బాలశౌరి మీడియాకు వెల్లడించారు.
టైమింగ్స్, ప్రయోజనాలు ఇవే...
గన్నవరం నుంచి ముంబయికి కొత్త ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభమైంది. ఈ విమానం ముంబయిలో మధ్యాహ్నం 3 గంటల 57 నిమిషాలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5గంటల 50 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 9గంటలకు ముంబయికు తిరిగి చేరుకుంది. రోజూ ఇదే మాదిరిగా సర్వీసు ఉంటుంది. ఎయిరిండియా ఫ్లయిట్ AI 599 నంబరుపై సర్వీసు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. గన్నవరం (విజయవాడ) ఎయిర్‌పోర్టు నుంచి ముంబయికి రాకపోకలు సాగించే ఫ్లైట్ విదేశాలకు వెళ్లేవారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉండనుంది.