ఒంగోలు: ప్రముఖ దిగంబర కవి మహాస్వప్న ఇక లేరు. ఆయన వయస్సు 79 ఏళ్లు. తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించడానికి సాగిన దిగంబర కవిత్వోద్యమంలో మహాస్వప్నది విలక్షణమైన గొంతు. నెల రోజుల క్రితం పాక్షికమైన పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. 

మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు తీవ్ర అస్వస్థతకు గురై ప్రకాశం జిల్లా లింగసముద్రంలోని తన స్వగృహంలో మహాస్వప్న తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యాన్ని 1960 దశకంలో ఆరుగురు కవుల్లో మహాస్వప్న ఒకరు. వారిలో ఇక ముగ్గురు మిగిలారు.

"నేను వస్తున్నాను దిగంబరకవిని" అంటూ దిగంబర కవిత్వోద్యమానికి మహాస్వప్న స్వాగతం పలికారు. ఆయన భౌతికకాయానికి బుధవారం లింగసముద్రంలోనే అంత్యక్రియలు జరుగుతాయి. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మిశెట్టి వెంకయ్య నారాయణమ్మల ఏకైక కుమారుడు. ఆయనకు ఒక చెల్లెలు ఉంది. లింగసముద్రంలో ఆయన ఆమె దగ్గరే ఉంటూ వచ్చారు. వృతిరీత్యా వ్యవసాయదారుడైనమహాస్వప్న బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
 
ఇంటర్మీడియెట్‌ వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మహాస్వప్న చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. దాంతో ఆయన జీవితం మలుపు తీసుకొంది. అక్కడ వివేకవర్థని కళాశాలలో బీఏలో చేరారు. ఈక్రమంలో అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. 1958లో ప్రముఖ సంపాదకుడు నార్ల చిరంజీవి సహకారంతో పద్దెనిమిదేళ్ల వయసులోనే చందమామ పేరుతో బాలకవితా సంపుటి వెలువరించారు. 

1964లో అగ్నిశిఖలు - మంచు జడులు, స్వర్ణధూళి కవితా సంపుటులను ప్రచురించారు.  బద్ధం భాస్కరరెడ్డి (చెరబండరాజు), మానేపల్లి హృషికేశవరావు (నగ్నముని), యాదవరెడ్డి (నిఖిలేశ్వర్), వీరరాఘవాచార్యులు (జ్వాలాముఖి), మన్మోహన్‌ సహాయ్‌ (భైరవయ్య)లు దిగంబర కవులుగా తెలుగు కవిత్వంలో భూకంపం పుట్టించారు..
 
దిగంబర కవుల ఉద్యమం మూడేళ్లపాటు సమాజంపై, సాహిత్యంపై తీవ్రమైన ముద్ర వేశాయి. వారి పదజాలం, వ్యక్తీకరణ తీవ్ర విమర్శలకు కూడా గురైంది.చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో చేరిపోయారు. భైరవయ్య, మహాస్వప్న మాత్రం ఉద్యమాలకు దూరంగా ఉండిపోయారు.