వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల మధ్య సఖ్యత లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంతా ఇదే పరిస్ధితి నెలకొంది.
ప్రకాశం జిల్లా కొండెపి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టంగుటూరులోని వైసీపీ మహిళా నేత, కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ బోడపాటి అరుణ, వైసీపీ నేత డేవిడ్ ఇంటిపై కొండెపి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబు దాడి చేశాడు. అరుణ ఇంట్లోని ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా లాక్కొని పగులగొట్టేశారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండెపి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబుపై ఆరోపణలు చేసినందుకే తమ ఇంటిపై దాడి చేశారని అరుణ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
అటు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలోనూ విభేదాలు భగ్గుమన్నాయి. గత నెలలో ఎంపీ బాలశౌరి అనుచరుడిపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులు దాడి చేశారు. వివరాలు.. మూడు నెలల క్రితం జరిగిన సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి అనుచరులతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులకు మధ్య విభేదాలు చెలరేగాయి. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంకలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. అయితే ఫ్లెక్సీ విషయమై ఎంపీ బాలశౌరి పీఏపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలు ఇరువురు నేతల అనుచరుల మధ్య ఘర్షణకు దారితీసింది. బాలశౌరి అనుచరులపై సింహాద్రి రమేష్ అనుచరులు దాడి చేశారు. చెప్పులతో కూడా కొట్టారు. ఈ ఘటనను ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మేనల్లుడు దాడి చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోనూ స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో స్పందన మీటింగ్ హాల్‌ను నూతనంగా నిర్మించారు. దీని నిమిత్తం బాలశౌరీ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.15 లక్షలు వెచ్చించారు. ఈ రోజు మీటింగ్ హాల్ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందాయి. అయితే అధికారిక కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని డుమ్మా కొట్టారు.
