వైసీపీ నేత వంగవీటి రాధా.. జగన్ కి షాకివ్వనున్నారా..? ఎన్నికల సమీపిస్తున్న సమయంలో.. రాధా వైసీపీని వీడి మరో పార్టీలోకి జంప్ చేయనున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే సందేహాలే కలుగుతున్నాయి.

ఈరోజు వంగవీటి మోహన రంగా 30వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా.. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని అభిమానులను కోరారు. తన తండ్రి పేద ప్రజల శ్రేయస్సుకి సహకరించారని.. తాను కూడా అదే బాటలో నడుస్తానని అన్నారు.

ఇదిలా ఉండగా.. తమ సొంతూరు కాటూరులో స్మృతి స్థూపం నిర్మాణానికి ఈ రోజు వంగవీటి రాధా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం తన అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా కదిలివెళ్లారు. ఇక్కడి వరకు కార్యక్రమం బాగానే జరిగింది. కానీ.. ఇక్కడే సందేహాలు కూడా మొదలయ్యాయి. 

ఈ ర్యాలీలో.. ఎక్కడా కనీసం ఒక్కటి కూడా వైసీపీ జెండా కనిపించలేదు. సాధారణంగా ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తల చేతుల్లో పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఈ ర్యాలీలో ఒక్కరిదగ్గర కూడా కనిపించలేదు. దీంతో.. రాధా పార్టీ మారడం కాయమంటూ ప్రచారం మొదలైంది.  విజయవాడ సెంట్రల్ సీటు తనకు ఇస్తారని ఎదురుచూసిన రాధకు నిరాశ ఎదురైంది.

ఆ టికెట్ ని తనకి కాకుండా విష్ణుకి కేటాయించడం పట్ల.. తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా పార్టీ మారడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.