ముఖ్యమంత్రి ఎంతో దూరదృష్టితో పెద్దనోట్ల రద్దు గురించి రాసిన రెండుపేజీల ఉత్తరాన్ని ప్రధాని మోడీ చదవినట్లే లేరు. ఎందుకంటే,  ఇపుడు జరుగుతున్నది ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకం.

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటప్రకారమే ప్రధాని నరేంద్రమోడీ అయిదొందల, వేయి నోట్లను రద్దు చేశారా? ముఖ్యమంత్రి విజ్ఞతతో రాసిన ఉత్తరాన్ని ప్రధాని చదివారా అనే ప్రశ్న ఎదురవుతుంది ఇపుడు జరుగుతున్నదంతా చూస్తే.

కచ్చితంగా ముఖ్యమంత్రి మాట ప్రకారం ప్రధాని ఈ చర్యకు పూనుకోలేదని ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ చెప్పిందాని వల్ల అర్థమవుతుంది.

 అయిదొందల, వేయి నోట్ల రద్దనగానే అది మా నాయకుడి అయిడియాయే అని తమ్ముళ్లంతా గోల గోల చేశారు. ఆయన ప్రధానికి రాసిన లేఖని సాక్ష్యంగాచూపించారు. ప్రపంచం యావత్తూ ఈ విషయం తెలుసుకోవాలని నారా లోకేశ్ ఈ లేఖని ట్విట్టర్లో కూడా పెట్టారు. తీరా చూస్తే, నాయుడు రాసిన దానికి పూర్తిగా భిన్నంగా వ్యవహారం నడుస్తున్నట్లుంది.

ఈ పెద్ద నోట్ల అసలు వద్దంటే వద్దన్నారు ఆంధ్రా ముఖ్యమంత్రి. అయితే ప్రధాని ఇంకా పెద్ద నోటు ముద్రించేశారు. అంతేకాదు, రద్దయిన వేయి రుపాయలను కూడా మళ్లీ కొత్త రూపంలో తెస్తామంటున్నారు.

కొత్త క‌ల‌ర్ కాంబినేష‌న్‌, కొత్త డిజైన్‌తో రూ.1000 నోట్లు విడుద‌లవుతాయని శక్తికాంత్ దాస్ ఇవాళ తెలిపారు. రెండు మూడు నెలల్లో ఆ వెయ్యి నోట్లు ఛలామణి లోకి వ‌స్తాయ‌న్నారు. కొత్త నోట్ల డిజైన్‌కు సంబంధించిన ప్ర‌క్రియ గ‌త రెండు మూడు నెల‌లుగా గోప్యంగా సాగుతోంద‌ని అంటూ ఆర్‌బీఐకి చెందిన కేవ‌లం ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్ర‌మే ఆ ప్ర‌క్రియ‌లో నిమ‌గ్న‌మైన‌ట్లు శ‌క్తికాంత్ దాస్ వెల్ల డించారు.

అంటే కొత్త అయిదొందల నోట్ల, రెండువేల నోట్లు, తొందర్లో వేయి నోట్లు అన్నీ వస్తున్నాయి. ఛలామణి నుంచి పోయినవి పాతనోట్లే కాని, ఏవీ రద్దు కావడం లేదు.అసలు నాయుడిగారి ఉత్తరాన్ని, అందులోని అర్ధికాంశాన్ని ’సౌత్ బ్లాక్’ ఖాతరు చేసినట్లు లేదనిపిస్తుంది.

ఇప్పటికయినా మించింది లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖని ప్రధాని పూర్తిగా చదవాలి. అయిదొందల , వేయి 500, నోట్ల చలామణీ అవసరం లేదని పెద్ద నోట్ల ఉనికి మీద విస్తృత చర్చ జరగాల్సి ఆయన చేసిన సూచనని ప్రధాని గమనించాలి.

పెద్ద నోట్ల రద్దుతో అవినీతి, ఆర్థిక నేరాలు తగ్గుతాయని, సింగపూర్‌, కెనడాలో అలా సత్ఫలితాలు వచ్చాయని సీఎం చెప్పారు.