మోదీ హ్యాండిచ్చాడా.. పవన్ వద్దనుకున్నాడా..? కేంద్ర కేబినెట్లో జనసేన ప్లేస్ ఎందుకు మిస్ అయ్యింది..?

కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ, మంత్రులు, సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం చకచకా జరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులయ్యారు. ఏపీలో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్ పదవులు దక్కాయి. కానీ జనసేనకు మాత్రం అవకాశం రాలేదు. ఎందుకు..? పవన్ కల్యాణ్ కు మోదీ హ్యాండిచ్చారా..?

Did Modi give a hand..? Pawan thought no..? Why did the Janasena miss the place in the central cabinet..?

‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చారిత్రక విజయం సాధించారు. ఈ విజయం జనసేనాని పవన్ కల్యాణ్ వల్లే సాధ్యమైంది. పవన్ అంటే పవనం కాదని, తుఫాను’’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే సమావేశంలో జనసేన అధినేతను ఆకాశానికెత్తారు. 

పవన్‌ కల్యాణ్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ అన్న మాటలు జనసేన కేడర్‌లో జోష్‌ నింపాయి. కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు ప్రాధాన్యం దక్కుతుందని... ఇక చక్రం తిప్పేది పవనేనని అంతా భావించారు. అయితే సీన్‌ రివర్స్‌ అయింది. కేంద్రంలో చెప్పుకోదగ్గ పదవులేవీ జనసేనకు దక్కలేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. 21 చోట్ల విజయం సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ఐదుగురు ఎంపీలకు కేంద్ర కేబినెట్ పదవులు దక్కుతాయని అందరూ భావించారు. టీడీపీ, జనసేన, బీజేపీలోని సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం ప్రయత్నాలు కూడా చేశారు. 

అయితే, అక్కడే కథ అడ్డం తిరిగింది. పదవుల కన్నా రాష్ట్ర ప్రగతే ముఖ్యమన్న భావనలో ఉన్నారట తెలుగుదేశం, జనసేన అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్. మరోవైపు, ఎక్కువ మంది ఎంపీలకు కేంద్ర పదవులు ఇస్తే ఢిల్లీలో తమను మించిపోతారన్న భావనా పార్టీ అధినేతల్లో ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్, టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అమలాపురం ఎంపీ, మాజీ స్పీకర్ బాలయోగి కుమారు గంటి హరీశ్ మాధుర్, జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ లాంటి వారి పేర్లు తొలుత తెరపైకి వచ్చాయి. కేంద్ర మంత్రివర్గంలో వారికి అవకాశం దక్కుతుందని చర్చ విపరీతంగా జరిగింది. అయితే, తుది జాబితాలో వీరి పేర్లు లేకుండా పోయాయి. 

ఫైనల్‌గా ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి కేంద్ర పౌర విమానయాన శాఖ దక్కింది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ తొలిసారి పార్లమెంటుకు ఎన్నికై.. సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఇక, బీజేపీ సీనియర్‌ నేత, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరు కేంద్ర మంత్రివర్గంలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలకు సహాయ మంత్రి అయ్యారు శ్రీనివాస వర్మ. 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ 16 ఎంపీలను గెలిపించుకొని.. రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కించుకోగా... మూడు ఎంపీ స్థానాల్లో గెలిచిన బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు. మరి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన జనసేనకు కేంద్ర మంత్రవర్గంలో చోటు దక్కకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరికి జనసేన తరఫున కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ కన్ఫర్మ్ అని అందరూ అనుకుంటే.. తీరా అది జరగలేదు. అసలేమైంది...? కేంద్ర కేబినెట్లో జనసేన ప్లేస్ ఎందుకు మిస్ అయ్యింది..? పవన్‌ కల్యాణ్‌కు మోదీ హ్యాండిచ్చారా..? అసలు పవనే వద్దనుకున్నారా..? లేక చంద్రబాబు అడ్డుపడ్డారా..? ఏం జరిగింది...? ఈ ప్రశ్నలు జనసైనికులతో పాటు ఆ పార్టీ అభిమానుల్లోనూ వ్యక్తమవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios