Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం దివాళా తీసిందా?: ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న

భూములను అమ్ముకోవవసిన అవసరం ఏమొచ్చిందని, ప్రభుత్వం దివాళా తీసిందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Did AP Government Go Bankrupt? High court questions
Author
Amaravathi, First Published May 27, 2020, 7:01 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం భూములు అమ్మడంపై సీరియస్ అయిన హైకోర్టు ఏకంగా ప్రభుత్వం దివాళా తీసిందా అని ప్రశ్నించింది. 

‘భూములను అమ్ముకోవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం దివాలా తీసిందా’ అని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్నినిలదీసింది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరుపై కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

‘రాష్ట్రంలో అత్యధిక దిగుబడి వచ్చే పంటలు పండే సారవంతమైన భూములున్నాయి. రాష్ట్ర ప్రజలు ధనవంతులుగా ఉంటే, ప్రభుత్వం మాత్రం పేదరికంలో ఉందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాన్ని ప్రభుత్వం ఉపయోగించుకొనే ఆలోచన చేయాలని కోర్టు అభిప్రాయపడింది."  

ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, భూముల అమ్మకాలన్నీ తమ ఆదేశాలకు లోబడి మాత్రమే ఉంటాయని తెలుపుతూ, ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపు మే 28వ తేదీకి వాయిదా వేసింది. 

ప్రైవేటు వ్యక్తులు విరాళంగా ఇచ్చిన భూములను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు పిల్ దాఖలు చేసారు. దీనిపై మంగళవారం మరోసారి హైకోర్టులో విచారణ జరిపిన  జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇకపోతే... టీటీడీ ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలిపివేస్తూ టీటీడీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్‌ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేలం నిర్వహణకు నియమించిన రెండు బృందాలను కూడా రద్దు చేస్తూ టీటీడీ ఈవో ఆదేశించారు. అలాగే ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియను రద్దు చేస్తూ టిటిడి ఆదేశాలు జారీ చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీటీడీ భూముల అమ్మకంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న అప్పటి టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జనవరి 30న చేసిన తీర్మానంలో 50 చోట్ల భూములు అమ్మాలని అప్పటి బోర్డు తీర్మానించింది. అలాగే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు సూచించింది.అలాగే  ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భూముల వేలం ప్రక్రియ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios