ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

గుంటూరు: వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) మూడేళ్ల పాలనపై టీడిపి మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ (dhulipalla narendra) సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మూడేళ్లలోనే ఏపీ ప్రజలకు నరకాన్ని చూపించారని... మిగిలిన రెండేళ్లూ ఈ నరకాన్నే అనుభవించక తప్పదన్నారు. జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన అని... ఏపీలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోందంటూ ధూళిపాళ్ల ఎద్దేవా చేసారు. 

ముఖ్యమంత్రి జగన్ కు పాలనపై కంటే రాజకీయాలు, ఇతర వ్యవహారాలపైనే ఆసక్తి చూపిస్తారని అన్నారు. రాష్ట్ర పాలనలో అతి ముఖ్యమైన సచివాలయానికి కనీసం నెలకోసారైనా రారని... ఈయన పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్దిని ఆశించలేమని ధూళిపాళ్ళ అన్నారు. 

ఎన్నికలకు ముందు వైసిపి ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి ప్రత్యేక హోదా (special status to ap) తెస్తానన్న జగన్ మాటలు ప్రజలు నమ్మారని... అందువల్లే 22 మంది ఎంపీలను గెలిపించారన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని... తద్వారా భారీగా పరిశ్రమలు వస్తాయని గతంలో ఇదే జగన్ చెప్పారని గుర్తుచేసారు. కానీ ఇప్పుడేమో ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ప్లేట్ ఫిరాయించాడని ధూళిపాళ్ల ఆరోపించారు. 

గతంలో టిడిపి (tdp) ప్రభుత్వ హయాంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించి రైతులు ఆనందంగా వుండేవారని ధూళిపాళ్ల అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా రూ.16వందలకు అమ్ముకున్న ధాన్యం జగన్ హయాంలో నేడు వెయ్యికి దిగజారిందని అన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ప్రభుత్వ గణాంకాలే తేల్చాయని ధూళిపాళ్ల ఆందోళన వ్యక్తం చేసారు. 

ఇటీవల అకాల వర్షాలు, తుఫానులు ఇలా వివిధ కారణాలతో రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది... కానీ వైసిపి ప్రభుత్వం కేవలం రూ.1402 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన పంటనష్టం పరిహారాన్ని ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదని ధూళిపాళ్ల ఆరోపించారు. 

ఇదిలావుంటే వైసిపి మూడేళ్ల పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు ఆ పార్టీ నాయకులంతా వైసిపి పాలనపై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టిడిపి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మూడేళ్ల పాలనలో 1,116 అక్రమాల పేరుతో టీడీపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఆంద్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు.

ఇక ఈ వైసిపి పాలనపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ జగన్‌ది విధ్వంసకర పాలన అని విమర్శించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని... జగన్ పాలనలో ప్రజలను ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు నాంది పలికారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.