అమరావతి:దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఊహగాహనాలు, ప్రచారాలు చేసే వారికి నోటీసులు ఇస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.ఈ కేసు విచారణ సాగుతోందన్నారు.

మంగళవారం నాడు  డీజీపీ గౌతం సవాంగ్ విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పారు. కేసు విచారణ సమర్థవంతంగా, సక్రమంగా జరుగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలను తాము పట్టించుకోబోమన్నారు. తమ పని తాము చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం బాగా తగ్గిందని, ప్రజల్లో కూడా మావోల భావజాలం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు.  డెమోక్రసీ ద్వారా మాత్రమే మార్పు వస్తుందని, హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని హితవు పలికారు. మావోయిస్టు నేత అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న ప్రచారం నిజం కాదని చెప్పారు. పోలీసుల అదుపులో ఏ మావోయిస్టు కూడా లేరని డీజీపీ స్పష్టం చేశారు.

ఈ ఏడాది మార్చి మాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని దుండగులు ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సిట్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సిట్  ఏర్పాటు చేశారు.

ఈ సిట్   ఈ కేసును విచారిస్తోంది. ఇటీవలనే సుపారీ గ్యాంగ్ వైఎస్ వివేకాను హత్య చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ వార్తలను కడప జిల్లా ఎస్పీ ఖండించారు. 

మరోవైపు తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య కూడ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వ్యాఖ్యానించారు. ఈ హత్య కేసులో నిందితులు ఎవరో సీఎం జగన్ కు తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా డీజీపీ మంగళవారం నాడు  స్పందించారు.