Asianet News TeluguAsianet News Telugu

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ఆ దర్శనాలు రద్దు , ఇప్పట్లో కొండకు రావద్దంటోన్న టీటీడీ

వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు

devotees rush in tirumala
Author
Tirumala, First Published Aug 13, 2022, 10:09 PM IST

వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం గోగర్భం జలాశయం వరకు 4 కిలోమీటర్ల మేర సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో శ్రీవారి దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కొండపై నెలకొన్న రద్దీని దృష్టిలో వుంచుకుని తిరుమల యాత్రకు రావాలని ఆయన కోరారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. సెలవులు, పెళ్లి ముహూర్తాల వల్ల కొండపై భక్తుల రద్దీ పెరిగిందని.. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ చెప్పారు. 

ఇకపోతే.. తిరుమలలో గదుల కేటాయింపులో తరచూ అక్రమాలు జరుగుతుండటం, పలువురు పట్టుబడుతూ వుండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీరియస్‌గా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా గదుల కేటాయింపు ప్రక్రియపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో భేటీ అయ్యారు. ఇప్పటికే గదుల కేటాయింపులో వున్న లోపాలను టీటీడీ గుర్తించింది. గదుల కేటాయింపులో దళారులను ఏరివేసేలా.. పోలీస్, విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ధర్మారెడ్డి నిర్ణయించారు. 

ALso Read:తిరుమల : గదుల కేటాయింపులో అవకతవకలు.. ఈవో సీరియస్, ప్రత్యేక బృందాల ఏర్పాటు

మరోవైపు.. టీటీడీలో ఇంటి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్న టీటీడీ సూపరింటెండెంట్‌ మల్లిఖార్జున్‌తో పాటు ఇద్దరు మహిళల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా భారీగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 760 బ్రేక్ దర్శన టికెట్లు, 350 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 25 సుప్రభాత సేవా టికెట్లను, 32 గదులను విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios