విజయవాడ: ఇటీవల తమిళనాడు పోలీసులు ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన కారులో తరలిస్తున్న ఐదున్నర కోట్లను సీజ్ చేశారు. ఇలా పట్టుబడిన డబ్బు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదిగా టిడిపి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోషల్ మీడియా వేదికన ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'''ఏపీలో దోచుకో... త‌మిళ‌నాడులో దాచుకో' అనే జ‌గ‌న‌న్న దోపిడీ ప‌థ‌కం కింద త‌ర‌లుతూ ప‌ట్టుబ‌డ్డ 5.25 కోట్ల‌పై నోరెందుకు విప్ప‌డం లేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. లాక్‌డౌన్ టైములో అనుమ‌తి లేకుండా అన్ని కోట్లు ఎక్క‌డి నుంచొచ్చాయి?'' అంటూ సీఎంను ప్రశ్నించారు. 

read more  రాజధాని బిల్లులను తిరస్కరించండి...లేదంటే రాష్ట్రపతికి: గవర్నర్ కు సిపిఐ లేఖ

ఇక టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై కూడా దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అధికారమదం తలకెక్కి తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన తెలుగుప్రజల గుండెచప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు. సెంటుపట్టా కుంభకోణాన్ని బయటపెట్టినందుకు మీ ప్రజాప్రతినిధులు ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంటే మీరేం చేస్తున్నారు. ఇది ఉన్మాదం  కాదా? జగన్ గారు'' అని ప్రశ్నించారు. 

''నిన్న బాపట్లలో రాజ్యాంగనిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ తొలగింపు, నేడు నెల్లూరు జిల్లా ముసునూరులో తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ గారి విగ్రహ తొలగింపు. వినాశకాలే విపరీత బుద్దులన్నట్లు.. మహనీయులపట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు జగన్ గారు'' అంటూ ట్విట్టర్ ద్వారా దేవినేని ఉమ మండిపడ్డారు.