గుడివాడ : వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికల ప్రచారంలో రూ.3000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్ ఎన్నికల అనంతరం దానికి తూట్లు పొడిచారన్నారు. ప్రమాణ స్వీకారం రోజున రూ.2250కి పింఛన్ ను కుదిస్తూ సంతకం పెట్టారని ఆరోపించారు. 

గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండల టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవినేని అవినాష్ అమ్మఒడిపై ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల ఫలితాల అనంతరం చేస్తోంది మరోకటి అంటూ విమర్శించారు. 

అమ్మఒడి పథకంలో వైసీపీ ప్రభుత్వం పార్టీ  కొర్రీలు పెడదామని భావించిందని అయితే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో దాన్ని సరిదిద్దుకున్నారంటూ విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల పోరుకు కార్యకర్తలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిదాడులకు దిగి బుద్ధి చెప్తామన్నారు. 

ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపే రోజులు మారాయని, ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు కొట్టే రోజులివన్నారు. టీడీపీ కార్యకర్తలపై రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయంగా కేసులు పెడితే పోరాటం చేస్తామన్నారు.