Asianet News TeluguAsianet News Telugu

ఇవ్వాల్సింది గాజులు కాదు... భువనేశ్వరికి పుష్ప శ్రీవాణి కౌంటర్

తన కుటుంబ సభ్యులసహా తన పార్టీ నాయకులు, సహచరులు రాజధాని పేరుమీద చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయన్న ఆందోళనతో ఇవాళ మరో డ్రామా చేశారని విమర్శించారు.

Deputy CM Pushpa Srivani Fire on Chandrababu And his wife Bhuvaneswari
Author
Hyderabad, First Published Jan 2, 2020, 8:15 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. అమరావతిని మాత్రమే రాజధానిగా  ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి దీక్షకూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో.. నారా భువనేశ్వరి రాజధాని రైతుల కోసం తన బంగారు గాజులు ఇచ్చారు. ఆమె అలా బంగారు గాజులు ఇవ్వడంపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు.

జనవరి 1న రాష్ట్ర మంతటా సంక్షేమరాజ్యంలో మరో చరిత్రాత్మక సంవత్సరానికి శ్రీకారం చుడితే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో కొట్టేసిన భూములు బయటపడుతున్నాయని ఆమె ఆరోపించారు.  తన కుటుంబ సభ్యులసహా తన పార్టీ నాయకులు, సహచరులు రాజధాని పేరుమీద చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయన్న ఆందోళనతో ఇవాళ మరో డ్రామా చేశారని విమర్శించారు.

అసలు రాజధాని గ్రామాల్లో ఇవ్వాళ్టి పరిస్థితులకు కారణం చంద్రబాబు అన్న సంగతి అందరికీ తెలుసు అని ఆమె పేర్కొన్నారు. గ్రాఫిక్స్‌ చూపించి, రైతులను, ప్రజలను భ్రమల్లో పెట్టి వారి కుటుంబాలను రోడ్డుమీదకు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.

ఇచ్చినమాట ప్రకారం ఐదేళ్లలో రాజధానిని ఎందుకు కట్టలేకపోయారు అని ప్రశ్నించారు. ఎందుకు మా భూములను అభివృద్ధిచేసి ఇవ్వలేకపోయారని రాజధాని గ్రామాల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని ఆమె విమర్శించారు.

అందుకనే ఇవాళ కుటుంబ సభ్యులను కలుపుకుని మరో నటనకు తెరలేపారంటూ మండిపడ్డారు.రాజధాని ఉద్యమానికి తన వంతు విరాళం అన్నట్టుగా ఆయన భార్యచేత గాజులు ఇప్పించారని ఎద్దేవా చేశారు.

ఇవ్వాల్సింది గాజులు కాదని.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో పప్పుబెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన రైతుల భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని ఆమె అన్నారు.

 భువనేశ్వరి గారు... మీ కంపెనీ హెరిటేజ్‌ పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి 14.22 ఎకరాల భూమిని చవగ్గానే కొట్టేసిందని అన్నారు. దయచేసి 14 ఎకరాలను తిరిగి ఆ రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ మీరిచ్చే గాజులకన్నా.. ఆ రైతుకు కలిగిన నష్టం వందల రెట్లు పెద్దదన్నారు.

కంతేరు సమీపంలో సర్వే నంబరు 27, 28, 56, 67, 62ల్లో మొత్తం 14.22 ఎకరాలు 2014 ఆగస్టులో అంటే అసెంబ్లీలో రాజధాని ప్రాంత ప్రకటన సెప్టెంబరు 2014లో చేస్తే దానికి నెలరోజులు ముందు మీరు కొన్నారని గుర్తు చేశారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా మీరు కొన్న ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తే... మీరు గాజులు ఇచ్చినంత పుణ్యం దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు... రాష్ట్ర విభజన జరిగి మీ భర్త చంద్రబాబుగారు అధికారం చేపట్టిన జూన్‌ 2014 నుంచి డిసెంబర్‌ 2014 వరకూ అహరహం శ్రమించి, రాత్రీ పగలూ నిద్రపోకుండా మీ కుటుంబ సభ్యుల చేత, మీ పార్టీ నాయకులచేత, సహచరుల చేత 4069 ఎకరాలు కొనుగోలు చేసినట్టగా ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందన్నారు.

‘‘మరింత లోతుగా దర్యాప్తుచేస్తే ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రైతుల పొట్టకొట్టి కొన్నారో.. బయటపడుతుంది. ఈ 4069 ఎకరాలను తిరిగి ఇచ్చేయమని మీ కుటుంబ సభ్యులకు, మీ పార్టీ నాయకులకు, మీ సహచరులకు చెప్పాలని మా విజ్ఞప్తి. ఈసహాయం చేస్తే మీరిచ్చే గాజులు కన్నా.. రాజధాని రైతులకు గొప్పగా మేలు చేసినట్టే. ’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘రాష్ట్ర విభజన సమయంలో ఇంట్లోంచి బయటకు రాని మీరు ఇవాళ మీ భూములు కోసం మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నాయకుల భూములు కోసం బయటకు వచ్చారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా  మీ వ్యాపార, స్వప్రయోజనాలే ఎక్కువని అర్థమవుతోంది.వీటితోపాటు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై కమిటీ ఇచ్చిన నివేదిక, అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు జుడిషియల్‌ రాజధానిగా కమిటీ చేసిన సిఫార్సులు చంద్రబాబుగారికి, భువనేశ్వరిగారికి, నందమూరి రామకృష్ణగారికి సమ్మతం కాదని మీరు చెప్పకనే చెప్పారు.’’ అని విమర్శించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios