టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఏపీలోకి పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా కావడం వెనుక విపక్ష నేత చంద్రబాబు హస్తముందని ఆయన ఆరోపించారు.  

80 శాతం స్మగ్లింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు హస్తముందని.. అందుకే మద్యం స్మగ్లింగ్‌లో వాహనాలు పట్టుబడినప్పుడు డ్రైవర్‌, క్లీనర్‌ కాకుండా స్మగ్లింగ్‌ చేస్తున్న వాహన యజమానిపై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు నారాయణస్వామి వెల్లడించారు.

స్మగ్లింగ్ వెనుక ఏ పార్టీ నాయకులు ఉన్నా సహించబోమని నారాయణస్వామి తెలిపారు. మద్య నిషేధం కావాలా వద్దా అనేది చంద్రబాబు స్పష్టం చేయాలని ఆయన కోరారు. 

మద్యం దుకాణాల అద్దెలు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్ నిర్వహించి రూ.108 కోట్లు ఆదా చేసిందని నారాయణ స్వామి తెలిపారు. మద్యం దుకాణాల అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోందని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించామని ఆయన వెల్లడించారు.

గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు అద్దెగా రూ.671.04 కోట్ల రూపాయలు చెల్లించామని, కానీ ఈసారి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేవలం రూ.562.2 కోట్ల రూపాయలకు దీన్ని తగ్గించామన్నారు.

దీంతో రూ.16.22 కోట్ల ప్రభుత్వ నిధులు ఆదా అయ్యాయన్నారు. మద్యపానం తగ్గించడం వల్ల నేరాలతో పాటు ప్రమాదాలు కూడా బాగా తగ్గాయని డిప్యూటీ సీఎం తెలిపారు.