చిత్తూరు: సంపూర్ణ మద్యపాన నిషేధం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎ, ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి తీవ్రంగా ప్రతిస్పందించారు. మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేసిన తర్వాతనే తాము ప్రజలను ఓట్లు అడుగుతామని చెప్పారు. 

ఇటీవల చిత్తూరు జిల్లా ఆముదాలవలసలో ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణస్వామి మాట్లాడారు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తాము ఓట్లు అడుగబోమని చెప్పారు. ఏడాదికి 25 శాతం చొప్పున వచ్చే నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. 

త్రీస్టార్, ఫైవల్ బార్లలోనే మద్యం అమ్మకాలను అనుమతిస్తామని చెప్పారు. పవన్ తాగి  ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ తిరిగాడో తనకు తెలియదని, కానీ పవన్ కల్యాణ్ కు మద్యం రుచి తెలుసునని అన్నారు. అందుకే మద్యపాన నిషేధమంటే భయపడుతున్నారని అన్నారు. 

పవన్ కల్యాణ్ వంటివారు ఫైవ్ స్టార్ బార్లకు వెళ్లి మద్యం తాగవచ్చునని ఆయన అన్నారు. మద్యపాన నిషేధానికి మద్దతు ఇవ్వకపోతే జనసేనకు మహిళలు ఓట్లు వేయరని అన్నారు. ఏం తాగాలి, ఏం తినాలి అనే విషయాల్లో ప్రజలను నియంత్రించడం ప్రారంభిస్తే అందరూ ఎదురు తిరుగుతారని పవన్ కల్యాణ్ అన్నారు.