బాబు బైటికి రాలేరు.. లోకేష్ కూడా ఈ రోజో, రేపో... : ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి
చంద్రబాబు ఎప్పటికీ బైటికి రాలేరని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. లోకేష్ కూడా ఈ రోజో, రేపే అంటూ చెప్పుకొచ్చారు.

చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుకు సరిగ్గా చంద్రబాబు జైలుకు వెళ్లి ఆరు రోజులు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం నాడు మాట్లాడుతూ…చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉండి తీరాలని అన్నారు.
బుధవారం నాడు చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కత్తెరపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నప్పటికీ…ఆయన మీద ఈ కేసుతోపాటు పుంగనూరు అల్లర్ల కేసు, ఐటీ కేసు, అమరావతి రింగురోడ్డు కేసులు కూడా ఉన్నాయని అన్నారు.
చంద్రబాబుకు రిమాండ్.. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్, బాలయ్య, లోకేష్
అది ఇంకా కొనసాగుతున్నాయని.. వాటన్నింటినీ తప్పించుకొని ఆయన ఎప్పటికీ బయటకి రాలేరని చెప్పారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ మహానుభావుడు అని అన్నారు. లోకేష్ కు తెలియకుండా ఏమీ జరగదని లోకేష్ కూడా ఈ రోజు రేపు అంటూ నర్మగర్భంగా దాటేశారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్రజల్లో సానుభూతి లేదు అంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు కామెంట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారని, ఈ అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయన్నారు. అందుకే ఢిల్లీ నుంచి రోజుకు కోటి రూపాయలు తీసుకునే లాయర్లు వచ్చి వాదించినా, చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదన్నారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే.. ప్రజా స్పందన లేదు. చివరకు ఆ పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంటే బంద్‌కు ఎవరూ సహకరించలేదు. చివరకు హెరిటేజ్ షాపులన్నీ తెరిచే ఉన్నాయి. చంద్రబాబు జైలుకు పోయినా, ప్రజలు ఆయనపై సానుభూతి చూపడం లేదు. ఎందుకంటే, చంద్రబాబు పాలనతో తమకు ఏ మేలూ జరగలేదని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఎప్పుడు చంద్రబాబు పదవిలో ఉన్నా.. దోచుకో.. దాచుకో.. పంచుకో.. అన్నట్లు వ్యవహరించారు. అందుకే ప్రజలు అయ్యో అని కూడా అనడం లేదన్నారు. ఆ తరువాత మాట్లాడుతూ.. నాది ఒకటే ప్రశ్న.. చంద్రబాబు అవినీతిపరుడు కాదని ఆయన కొడుకు లోకేశ్ చెప్పగలడా? అన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదు..అని ఆ పార్టీ నేతలు కూడా చెప్పలేరు. ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా చంద్రబాబు అవినీతిపరుడు కాదని చెప్పదు. చంద్రబాబు అవినీతి వ్యవహారం ప్రజలకు కూడా బాగా అర్ధమైంది. డొల్ల కంపెనీలు పెట్టి, యథేచ్ఛగా ఖజానా దోచుకున్నాడని అందరికీ తెలిసిందేనన్నారు.
తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. ఆయనది సుపరిపాలన అన్నారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో 11.10 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గింది. జగన్ సుపరిపాలన అందిస్తున్నారు. అందుకే చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న చదువులు.. ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి వచ్చాయి. అలాగే చంద్రబాబు హయాంలో 12వ స్థానంలో ఉన్న పేదరికం, ఈరోజు 6వ స్థానానికి వచ్చిందన్నారు.