పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

అల్పపీడనానికి రుతుపవనాలు తోడు కావడంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడతాయని  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో గురువారం రెండు రాష్ట్రాల్లో వర్షం కురిసింది. చింతూరు, దెందులూరు, పెదవేగిలలో 8 సెంటీమీటర్లు, ఏలూరు, రాజమండ్రి, కూనవరంలో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ను వరద నీరు చుట్టుముట్టింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం.. కాఫర్ డ్యాం ప్రభావం వల్ల ముంపు గ్రామాలకు ముప్పు వుండటంతో వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించారు.

దాదాపు 2 వేల క్యూసెక్కుల వరద నీరు స్పిల్‌వే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది.