విశాఖపట్నం జిల్లా పాడేరు వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డిఈశ్వరి కనబడటం లేదు. అదేంటి? ఎంఎల్ఏ కనబడకపోవటమేంటి? అని మీ అనుమానమా? నిజమే పాడేరు నియోజకవర్గంలోని జనాలు అలానే చెప్పుకుంటున్నారు ఇపుడు. ఎందుకంటే, నియోజకవర్గంలో పర్యటించి జనాలను కలిసి చాలా కాలమైందట. తమకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవటానికి ప్రయత్నిస్తుంటే ఎంఎల్ఏ అందుబాటులో ఉండటం లేదని జనాలు మండపోతున్నారట. ఏదో పార్టీ కార్యక్రమాల వరకు హాజరవుతున్నారు సెక్యూరిటి మధ్య.  

ఇంతకీ విషయం ఏమిటంటే, టీచర్ గా పనిచేస్తున్న గిడ్డి ఈశ్వరికి వైసిపి పోయిన ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో టిక్కెట్టిచ్చి గెలిపించుకున్నది. గెలిచిన తర్వాత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంఎల్ఏకి బాగా ప్రాధాన్యతనే ఇచ్చారు. గిడ్డి కూడా వైసిపి తరపున టిడిపి ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే చేశారు. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించారు. కోట్ల రూపాయలు తీసుకుని, మంత్రిపదవికి ఆశపడి పార్టీ ఫిరాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.

టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత గిడ్డి పరిస్ధితి కూడా చాలా మంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లాగే తయారైంది. టిడిపిలోకి మారిన తర్వాత నియోజకవర్గంలో స్వేచ్చగా తిరగలేకపోతున్నారు. ఎక్కడ తిరుగుదామని అనుకున్నా జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మొన్నటి జన్మభూమి కార్యక్రమంలో జనాలు నిలదీసిన దెబ్బకు చివరకు తన కారును కూడా వదిలేసి ఆటోలో వెళ్ళిపోయారు.

మళ్ళీ అప్పటి నుండి నియోజకవర్గంలో ఎక్కడా గిడ్డి కనబడలేదట. ఇదే విషయమై సిపిఎం నేత నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ, గిడ్డి నియోజకవర్గంలో జనాలకు అందుబాటులో లేరంటూ మండిపడ్డారు. ఎంఎల్ఏ అమ్ముడుపోవటంతోనే గిరిజనుల నుండి గిడ్డి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోందని నర్సింగరావు అన్నారు. ఈశ్వరితో ఒకపుడు సన్నిహితంగా ఉన్న టీచర్లు కూడా మాట్లాడటం లేదట. పాపం ఎలావుండే ఎంఎల్ఏ ఫిరాయించిన తర్వాత ఎలా అయిపోయారో?