కాకినాడ: ఏడేళ్ల చిన్నారి సూరాడ దీప్తిశ్రీ కథ విషాదాంతంగా ముగిసింది. కన్నతల్లిలా కడుపులోపెట్టుకుని చూసుకుంటాదని భావించిన సవతితల్లి ఆమె పాలిట మృత్యువుగా మారింది. తనకు పుట్టిన కొడుకు కంటే తన సవతికి పుట్టిన కుమార్తెను ప్రాణంగా చూసుకుంటుండటంతో తమకు ఎక్కడ అన్యాయం చేస్తారన్న అనుమానంతో పసిగుడ్డును అత్యంత దారుణంగా హత్య చేసింది.  

వివారాల్లోకి వెళ్తే కాకినాడ సంజయ్ నగర్ కు చెందిన శ్యామ్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది. మెుదటి భార్య దీప్తిశ్రీకి జన్మనిచ్చిన మూడేళ్ల తర్వాత చనిపోయింది. తల్లిలేని ఆ పసికందుకు తల్లిలేని లోటు తీర్చాలని భావించిన శ్యామ్ కుమార్ 2017లో శాంతకుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. 

అయితే ఆమెకు గత ఏడాది బాబు పుట్టాడు. ఆ బాబుకు ప్రస్తుతం 13వ నెల. తల్లిలేని చిన్నారి కావడంతో శ్యామ్ కుమార్ దీప్తిశ్రీని ప్రాణపదంగా ప్రేమించాడు. చాలా గారాబంగా చూశాడు. దీప్తిశ్రీని గారాబం చేయడాన్ని చూసి సవతి తల్లి శాంతకుమారి తట్టుకోలేకపోయింది. 

విషాదాంతం: దీప్తిశ్రీని చంపి మూటకట్టి.. ఉప్పుటేరులో పడేసిన సవతి తల్లి

దీప్తిశ్రీ వల్ల తమను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాడోనన్న అనుమానం ఆమెలో పెరిగింది. అలాగే సవతి కుమార్తెపై ప్రేమ ఎక్కువగా చూపించడంతో తట్టుకోలేకపోయింది. ఆ ప్రేమ తన బిడ్డకే దక్కాలని భావించింది. అందుకు అడ్డుగా ఉన్న దీప్తిశ్రీని అంతమెుందిస్తే సరిపోతుందని భావించింది.

ప్లాన్ ప్రకారం మూడు రోజుల క్రితం దీప్తిశ్రీ చదువుతున్న స్కూల్ కి వెళ్లింది శాంతకుమారి. దీప్తిశ్రీని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ఒక టవల్ ను పాపతలకు చుట్టి అత్యంత దారుణంగా చంపేసింది. 

అనంతరం మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కేసింది. ఆ సంచిని ఇంద్రపాలెం గేట్లు వద్దకు తీసుకువచ్చి కాల్వలో వదిలేసింది. ఏమీ కానట్లు ఇంటికి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం ఏమి తెలియని దీప్తిశ్రీ తండ్రి శ్యామ్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. 

తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో సవతి తల్లి శాంతకుమారిని నిలదీయగా అనేక రకాల కట్టుకథలు అల్లింది. 

అయితే సీసీ టీవీ ఫుటేజ్ లో సవతి తల్లి దీప్తిశ్రీని తీసుకెళ్లిన విజువల్స్, హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి పడేసేందుకు ప్రయత్నించడం అన్నీ రికార్డు కావడంతో సవతి తల్లిపై పోలీసుల అనుమానం నిజమైంది. 

పోలీసులు తనదైన శైలిలో శాంతకుమారిని విచారిస్తే తానే హత్య చేసినట్లు చెప్పిందని ఎస్పీ నయీం తెలిపారు. తన భర్తకు సవతి కుమార్తె దీప్తి శ్రీ అంటేనే ఇష్టమని దాన్ని తట్టుకోలేకపోయానని విచారణలో తెలిపిందన్నారు. 

దారుణం:దీప్తిశ్రీని సవతి తల్లే చంపిందా?

ఈ హత్యఘటనపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వనితలు కూడా ఆరా తీసినట్లు తెలిపారు. అన్ని వివారాలు మంత్రులకు తెలియజేసినట్లు నయీం స్పష్టం చేశారు. 

నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరికాసేపట్లో న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని తెలిపారు. నిందితురాలిపై కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నయీం తెలిపారు.