అత్తారింట్లో అత్తగారు చేస్తున్న పెత్తనాన్ని తట్టుకోలేకపోయింది కోడలు. అందుకే మాష్టర్ ప్లాన్ వేసింది. కానీ చివరకు పోలీసులకు చిక్కింది. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన చోరీ ఘటనలో బాధితురాలి కోడలే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..పెనుమాకకు చెందిన మేకా కమల ఆమె కోడలు మేకా శివపార్వతిలు ఇంట్లో ఉండగా ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 78 లక్షల నగదు, 26 సవర్ల బంగారు వస్తువులు చోరీ చేసినట్లు బాధితురాలు కమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

స్పందించిన ఎస్పీ విజయారావుతోపాటు ఏఎస్పీలు వైటీ నాయుడు, తిరుపాల్‌, ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 8 మంది ఎస్సైలు సుమారు 50 మంది పోలీసులు కలిపి మొత్తం 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 

ఆ ఇంటికి సమీపంలోని సీసీ కెమేరాలు పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు నగదు బ్యాగ్‌ను తీసుకువెళుతున్న దృశ్యాలు లభించాయి. ఈ వ్యక్తులతోపాటు కోడలు శివపార్వతి తీరుపై అనుమానం వచ్చి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. పొలం అమ్మిన డబ్బులను కోడలకు ఇవ్వకుండా అత్త ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకొని పెత్తనం చేస్తుండటంతో ఆ నగదును కాజేయాలని శివపార్వతి పథకం రచించింది. 

ఆమె సోదరి వెనిగండ్లకు చెందిన కొండమడుగుల లక్ష్మీప్రసన్న, బంధువులైన జొన్నలగడ్డకు చెందిన వంగా సీతారామిరెడ్డి అతని కుమారుడు వంగా వెంకటరెడ్డి వారి స్నేహితులు గుంటూరు విద్యానగర్‌కు చెందిన చింతలచెరువు రాజు, నరసరావుపేట మండలం బరంపేటకు చెందిన చెంబేటి మల్లిఖార్జునరావు, లింగంగుంట్లకాలనీకి చెందిన తోట గోపీచంద్‌, సాయితో కలిసి ఆ నగదు దోచుకెళ్లడానికి కుట్రపన్నారు. 

గురువారం ఉదయం శివపార్వతి మిగిలిన వారికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు సీతారామిరెడ్డి.. మల్లికార్జునరావు, సాయి, గోపీచంద్‌లను బైక్‌పై ఇంటికి పంపించి వృద్ధురాలు కమలమ్మపై దాడిచేసి నగదు దోచుకెళ్లారు. కోడలు పెన్నుతో గాయపరుచుకుని దొంగలు దాడిచేశారని నమ్మించే ప్రయత్నం చేసిందని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.55 లక్షల నగదు, 210 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.