చంద్రబాబుకు డప్పు కొట్టకుండా వెంకయ్య అసలు ఉండలేక పోతున్నారని అందరూ అనుకుంటున్నారు. సందర్భం ఏదైనా సరే డప్పు కొట్టడమే వెంకయ్యపనిగామారిపోయిందని చెప్పుకుంటున్నారు

కేంద్రమంత్రి వెంకయ్యనాయడును అందరూ ఇపుడు డప్పు వెంకయ్య అని అంటున్నారు. ఎందుకంటే వెంకయ్యనాయడు ఏపికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు డప్పు కొట్ట కుండా ఉండలేకపోతున్నారు. తాజాగా గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంను వెంకయ్య సందర్శించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, కొద్ది సమయంలోనే చంద్రబాబు సచివాలయంను నిర్మించినట్లు చెప్పారు. అదికూడా సకల సౌకర్యాలతో నిర్మించినట్లు చెప్పటంతో అక్కడే ఉన్న ఉద్యోగులు ఆశ్చర్యపోయారు.

తాత్కాలిక సచివాలయం నిర్మించాలని నిర్ణయించిన ఏడాదికి గానీ తాత్కాలిక సచివాలయం పూర్తి కాలేదు. అదికూడా ఇంకా సమస్యలతో ఉద్యోగులు అవస్తలు పడుతూనే ఉన్నారు. ఒకటికి రెండు సార్లు అంచనా వ్యయాలను మార్చి, ఓసారి రెండస్తులు మాత్రమేనని,మరోసారి ఎనిమిది అంతస్తులని చెప్పారు. మళ్ళీ ఎనిమిది అంతస్తులు అయితే జాప్యం జరుగుతుందని చెప్పి తిరిగి రెండు అంతస్తులకే దిగారు.

ఇన్ని సార్లు ప్రణాళికలు మారిన తర్వాత కూడా నిర్మించిన భవనాల్లో సౌకర్యాలు ఇంకా అరాకొరగానే ఉన్నాయి. ఉద్యోగులందరికీ సరిపడా క్యాంటిన్ సౌకర్యం సమకూరలేదు. భవనాల్లో ఇంటరకమ్ సౌకర్యాలు లేవు. మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ కూడా సరిగా అందక అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉద్యోగుల రవాణా సౌకర్యాలు లేక అవస్తలు పడుతున్నారు. ఉద్యోగుల బస్సులను భవనాలకు దూరంగానే నిలిపేస్తున్నారు.

ఇన్ని అసౌకర్యాలున్నప్పటికీ వెంకయ్య అవేమీ ప్రస్తావించకుండా సకల సౌకర్యాలతో సచివాలయం భవనాలను చంద్రబాబు నిర్మించినట్లు చెప్పటం చూస్తుంటే సందర్భం ఏమైనా సరే చంద్రబాబుకు డప్పు కొట్ట కుండా వెంకయ్య ఉండలేకపోతున్నట్లు అర్ధమౌతోందని అందరూ అనుకుంటున్నారు.